Disney Plus Hotstar: ఐపీఎల్ డిజిటల్ రైట్స్ వదులుకున్న డిస్నీ హాట్‍స్టార్‌కు ఇప్పుడు అదెంత తప్పో తెలిసి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది దాని పరిస్థితి. వరుసగా సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది.
అయ్యో డిస్నీ..!
ఐపీఎల్ మీడియా హక్కులను వదులుకున్న దగ్గర్నుంచి డిస్నీ ప్లస్‌కు కష్టకాలం మొదలైంది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ భారీగా సబ్‌స్క్రైబర్లను డిస్నీ ప్లస్ కోల్పోయింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా కోటీ 25లక్షల మంది వెళ్లిపోయారు. ఐదుకోట్ల 29లక్షల మంది సబ్‌స్క్రైబర్లు గతంలో ఉంటే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి అది 4కోట్ల 4లక్షలకు పడిపోయింది. అంటే 24శాతం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ పడిపోయింది. మొత్తంగా తీసుకుంటే 9నెలల్లో 2 కోట్ల మందికి పైగా డిస్నీని వదిలేశారు. గతేడాది సెప్టెంబర్ చివరకు డిస్నీకి ఆసియాలో 6.13కోట్లమంది సబ్ స్క్రైబర్లు ఉండేవారు. అందులో మెజారిటీ వాటా ఇండియాదే. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కంటే డిస్నీ ఎంతో ముందుండేది. కానీ ఒక్క నిర్ణయంతో సీన్ రివర్సైపోయింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరకు పరిస్థితి మెరుగుపడుతుందని, సబ్‌స్క్రిప్షన్స్‌లో కోత ఆగిపోతుందని కంపెనీ భావించినా అలా జరగలేదు. అదే ఇప్పుడు డిస్నీని కలవరపెడుతోంది.
కొంపముంచిన ఐపీఎల్ హక్కులు..!
మన దేశంలో క్రికెట్ ఓ మతం.. ఓ పిచ్చి. టెస్ట్, వన్డే, టీ20, ఐపీఎల్ ఇలా మ్యాచ్ ఏదైనా సరే.. పనులు మానుకుని మరీ చూస్తారు. గతంలో టీవీ హక్కుల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దాన్లో కావాల్సినంత డేటా బ్యాలెన్స్ ఉంది. ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా మధ్య మధ్యలో మ్యాచ్ చూసేయవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకుని మరీ పనులు చేసుకోవచ్చు. దీంతో డిజిటల్ హక్కులకు పోటీ పెరిగిపోయింది. డిస్నీ హాట్‌స్టార్ యాప్‌కు భారీగా వినియోగదారులు పెరడగడానికి కారణం ఐపీఎల్ హక్కులే. వాటి కోసమే పెయిడ్ సబ్‌స్క్రైబ్ చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ హక్కులను జీయో సినిమాకు వదులుకోవాల్సి వచ్చిందో అప్పట్నుంచే డిస్నీకి కష్టాలు మొదలయ్యాయి. దీని ప్రభావం కొంత మేర పడుతుందని ముందే ఊహించినా.. వారు అనుకున్న దానికంటే ఎక్కువ ఎఫెక్టే పడింది. ఈ ఏడాది భారత్‌లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఉచితంగా అందిస్తామని డిస్నీహాట్ స్టార్ ప్రకటించడం కూడా దెబ్బకొట్టింది. ఎలాగూ ఉచితమే కాబట్టి సబ్‌స్క్రిప్షన్ రెన్యూవల్ చేసుకోవడానికి వీక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు.
డిస్నీ ప్లస్ ఇప్పుడేం చేయబోతోంది..!
ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు యాడ్ ఫ్రీ డిస్నీ ప్లస్, హులు ప్లాన్స్ ధరలు అక్టోబర్ నుంచి పెంచాలని భావిస్తోంది. అంతేకాదు పాస్‌వర్డ్ షేరింగ్‌పై కూడా ఆంక్షలు పెట్టనుంది. ఇది కొంతమేర కాపాడవచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే గత త్రైమాసికంలో డిస్నీ స్ట్రీమింగ్ డివిజన్‌కు 51.2 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. అదే 2019లో డిస్నీ ప్లస్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి తీసుకుంటే 11 బిలియన్ డాలర్ల మేర నష్టాలు వచ్చాయి.
జియో బిజినెస్ వ్యూహం..!
2023-27 కాలానికి ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్-18 సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ను జియో సినిమాలో ఉచితంగా అందిస్తున్నారు. తర్వాత దాన్ని కూడా పెయిడ్ యాప్‌గా చేస్తారని చెబుతున్నా ముందుగా ప్రజల్లోకి యాప్‌ను విస్తృతంగా తీసుకెళ్లే చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా అందించింది. అంతేకాదు వార్నర్ బ్రదర్స్, డిస్కవరీతో జతకట్టింది. హెచ్‌బీఓ, మాక్స్ ఒరిజినల్, వార్నర్ బ్రదర్స్ కంటెంట్‌ను జియో సినిమాలో అందిస్తోంది. గతంలో ఇవి డిస్నీలో అందుబాటులో ఉండేవి. మరి ఈ ఎదురుదెబ్బ నుంచి డిస్నీ ఎలా బయటపడుతుందో చూడాలి.