వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) జీవిత కథ (Life Story) ఆధారంగా గతంలో యాత్ర మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సరిగ్గా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సమయంలో ఈ మూవీని విడుదల చేశారు. ఆ మూవీని తీసిన విధానం చాలా మందికి నచ్చింది. జగన్ విజయంలో ఈ మూవీ కూడా ఉపయోగపడిందని చాలా మంది నమ్మారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయానికి జగన్ కథగా యాత్ర 2 (Yatra2) తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేయగా.. చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు మూవీ విడుదలకు కూడా రెడీ అవుతోంది.
మహి వి రాఘవ్ (Mahi V Raghav) యాత్ర 2 కి దర్శకత్వం వహించారు. కాగా…ఈ సినిమా ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. ఈ చిత్రం సాధారణ ఎంటర్‌టైనర్ కాదు. రాజకీయ సూచనలు, ఎజెండాలతో లోడ్ చేసి ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, కాంగ్రెస్ (Congress) హైకమాండ్ అభిష్టాన్ని వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్రను ఇది వివరిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా బడ్జెట్ (Movie Budget) దాదాపు 50 కోట్లు అని అంటున్నారు. ఈ బడ్జెట్‌లో చాలా భాగం మమ్ముటీ(Mammootty), జీవా (Jeeva), మహేష్ మంజ్రేకర్ వంటి నటుల పారితోషికంతో పాటు మిగిలిన సిబ్బందికి కేటాయించారు. అయితే.. పెట్టిన బడ్జెట్ వసూలు చేసే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. కానీ దీని వల్ల నష్టం సంగతి పక్కన పెడితే.. YSRCPకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. యాత్ర2లో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణానంతరం ప్రత్యర్థుల నుండి క్రూరమైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనే సంఘటనలతో సాగనుంది. ఆయన సీఎం అయ్యే వరకు ఈ కథ సాగే అవకాశం ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే ఈ సెంటిమెంట్, స్లో-బర్న్ తెలుగు డ్రామాలో పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన సంక్షిప్త సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాల 8 సెకన్లు.