మన తెలుగులో స్టార్ హీరోల కూతుళ్ళ కంటే కుమారుల హడావుడి ఎక్కువగా ఉంటుంది అనే మాట వాస్తవం. తండ్రి రేంజ్ లో కొడుకు కూడా రాణించాలి అనే తపన ఉంటుంది. ఫ్యాన్స్ అయితే ఇక వాళ్ళ ఫోటో ఒక్కటి బయటకు వచ్చినా సరే ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోల వారసుల హడావుడి గట్టిగానే ఉంది. తర్వాతి తరం విషయంలో అగ్ర హీరోలు ఓ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ కూతుళ్ళ హడావుడి కూడా గట్టిగానే కనపడుతోంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నారు.
తమ తండ్రి సినిమాల విషయంలో అలాగే సినిమాల నిర్మాణం విషయంలో వాళ్ళు ఓ పక్కా లెక్కతో ఉంటున్నారు. అసలు ఇప్పుడు ఎవరెవరు హడావుడి చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే… చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ముందు నుంచి చిరంజీవి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యంగా 150 వ సినిమా తర్వాతి నుంచి ఆమె డామినేషన్ ఎక్కువైంది అని టాక్. చిరంజీవి కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె పక్కాగా ఉంటారని టాక్. ఇక కథల విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని హడావుడి కూడా ఎక్కువైంది. బాలయ్య సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు తేజస్విని. తన తమ్ముడు మోక్షజ్ఞ సినిమాలో కూడా ఆమె పెట్టుబడి పెట్టారు. అలాగే బాలయ్య చేసే సినిమాలకు వర్క్ కూడా చేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. అయితే నటన విషయంలో మాత్రం ఆమె పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్. మెగా డాటర్ నిహారిక కూడా ఇప్పుడు సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎలా అయినా నిలబడాలి అనే పట్టుదలతో ఉన్నారు.
ముందు హీరోయిన్ గా ఆమె పెద్దగా ప్రభావం చూపించలేదు. తర్వాత నిర్మాతగా మారి ఇటీవల ఒక సినిమా చేసి హిట్ కొట్టారు. వీరితో పాటుగా మహేష్ బాబు కుమార్తె కూడా సందడి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె లైం లైట్ లోకి వస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ తో కూడా హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ కుమార్తె ఆధ్యా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమె హాజరు ఉంటుంది. దీనితో ఆమెను కూడా పవన్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమెకు తెలుగు కూడా నేర్పే ప్రయత్నం జరుగుతోందని టాక్. ఇలా ఇప్పుడు స్టార్ డాటర్స్ అందరూ సందడి మొదలుపెట్టారు.