Devara : దేవర’కు భారీ డిమాండ్

సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి.

 

 

సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి. దేవర, కల్కి సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ జూన్ నుంచి పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతోంది. ముందుగా కల్కి 2898ఏడితో బాక్సాఫీస్ వేట మొదలు పెట్టబోతోంది. జూన్ 27న కల్కి థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత ఆగష్టులో పుష్ప2 రావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే అవడం, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిసెంబర్‌కి పుష్ప2 వాయిదా పడింది. దీంతో.. కల్కి తర్వాత రానున్న పెద్ద సినిమా దేవర మాత్రమే. దీంతో.. బిజినెస్ పరంగా దేవరకు మరింత డిమాండ్ పెరిగినట్టుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏపీ థియేట్రికల్ రైట్స్‌ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నైజాం రైట్స్ దిల్ రాజు దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో.. రెండు తెలుగు స్టేట్స్‌లో దేవరను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి తర్వాత కాస్త గ్యాప్‌తో వస్తున్న పెద్ద సినిమా అవడంతో.. దేవర పై వసూళ్ల వర్షం కురిసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు హిందీ వెర్షన్ దేవర రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్టోబర్ 10న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక్కడితో దేవర షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టే.