Everything Everywhere All at Once Review: 7 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా.. రివ్యూ..!

Everything Everywhere All at Once సినిమా ఈ ఆస్కార్ అవార్డుల్లో ఏడింటిని గెలుచుకుని సత్తా చాటింది. అయితే అసలు ఏంటీ సినిమా..? ఈ సినిమా ప్లస్సులేంటి.. మైనస్ లేంటి..? అనే అంశాలను చక్కగా వివరించారు సీనియర్ జర్నలిస్ట్ శాంతి ఇషాన్.

  • Written By:
  • Updated On - March 25, 2023 / 08:15 PM IST

Everything Everywhere All at Once సినిమా ఈ ఆస్కార్ అవార్డుల్లో ఏడింటిని గెలుచుకుని సత్తా చాటింది. అయితే అసలు ఏంటీ సినిమా..? ఈ సినిమా ప్లస్సులేంటి.. మైనస్ లేంటి..? అనే అంశాలను చక్కగా వివరించారు సీనియర్ జర్నలిస్ట్ శాంతి ఇషాన్.
జీవితంలో చాలా సాధించాలనుకుంటాం. కానీ ప్రతి మలుపులోనూ పరిస్థితులకు రాజీపడిపోయి బతికేస్తుంటాం. ప్రతి చిన్న నిర్ణయానికీ తర్జన భర్జన పడిపోతుంటాం. సక్సెస్ కి ఆమడ దూరంలో నిలిచిపోతుంటాం. అలాగని ఒకే విషయంపై ఫోకస్ చేసి సక్సెస్ కొట్టిన వాళ్ళయినా ఏదో ఒక రంగంలో తప్ప అన్ని రంగాల్లోనూ విజయం సాధించలేరు కదా. కానీ మనం సాధించాలనుకుని వదిలేసి వచ్చిన విజయాన్ని మనలాంటి మనిషే మరో విశ్వంలో సాధిస్తే. అసలు మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కొన్ని వేల విశ్వాల్లో మన ప్రతిబింబాలను తయారు చేస్తే! మనం చేయాలనుకుని చేయలేకపోయిన పనులను ఆ ప్రతిబింబాలు చేసేస్తే. సరిగ్గా ఇలాంటి ఆలోచనే Danielsకి వచ్చింది. Daniels అంటే Daniel Kwan, Daniel Scheinert! ఈ ఇద్దరూ ఆస్కార్ పంట పండించుకున్న “Everything Everywhere All at Once” సినిమా డైరెక్టర్స్. Multiverse అనే sci-fi conceptకి ఏషియన్ మెలోడ్రామా కలిపి ఈ సినిమాని తయారు చేశారు.
ఎవిలిన్ వాంగ్ బోలెడు కలలున్న అమ్మాయి. సింగర్ అవుదామనుకుంటుంది. కుంగ్ ఫూ నేర్చుకుని స్టార్ అయిపోదామనుకుంటుంది. షెఫ్ అవుదామనుకుంటుంది. ఇంకా చాలా చాలా లక్ష్యాలే పెట్టుకుంటుంది. కానీ చివరికి వాంగ్ అనేవాణ్ని ప్రేమించి చైనా వదిలేసి అతనితో పాటు అమెరికా వచ్చేస్తుంది. అక్కడ భర్తతో కలిసి ఓ Laundromat (కాయిన్ వేసి వాషింగ్ మెషీన్లు వాడుకునే చోటు) నడుపుతుంది. ఎన్నో కావాలనుకుని ఏమీ కాలేకపోయానన్న అసంతృప్తి అంతర్లీనంగా పేరుకుపోయి చాలా అసహనంగా బతికేస్తుంటుంది. కూతురు జాయ్ లెస్బియన్. అమ్మకు తన పద్ధతి నచ్చలేదన్న బాధతో ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. భర్త విడాకులకు సిద్ధమవుతాడు. అలాంటి ఎవిలిన్ వేర్వేరు విశ్వాలకు చెందిన ఎవిలిన్లతో కనెక్ట్ అయితే! వాళ్ళ నుంచి శక్తిని గ్రహించి తన బతుకును చక్కదిద్దుకుంటే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా “primary” premise.
Sci-fi అనగానే క్రిస్టోఫర్ నోలన్ సినిమా లెవల్ లో ఊహించేసుకున్నా. కానీ కాసేపటికే ఏదో లో బడ్జెట్ అవెంజర్ సినిమాలాగా అనిపించింది. ఆ తర్వాత మొత్తానికే వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. పైన చెప్పిన premiseకి పోను పోను మరికొన్ని premises జతయ్యాయి. తరాల మధ్య అంతరాలు, కుటుంబ విలువలు, నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ, ప్రేమతో సాధించలేనిదేదీ లేదు, దేన్నైనా లైట్ తీసుకోవాలి etc. etc. ఈ premises everything, everywhere, all at once తరహాలోనే కలగూరగంపలాగా కలబడిపోయాయి. దానికి తోడు పాత్రలు ఉన్నట్టుండి వేరే యూనివర్స్ కి జంప్ అయిపోయి మరింత confuse చేసేస్తుంటాయి. ఇలా jump చేయడానికి verse jumping అని పేరు పెట్టారు. Verse jumping చేయాల్సిన ప్రతిసారీ ఓ task చేయాలి. ఆ tasks మరీ వెగటు పుట్టిస్తాయి.
ఇదొక absurdist black comedy drama. సినిమా పేరులానే genre కూడా పొడవే (LOL)! Absurd comedy నచ్చేవాళ్ళకు ఈ సినిమా నచ్చుతుందేమో కానీ నాకైతే నచ్చలేదు. మనసుకు నచ్చింది చెయ్యి అనే మాట చెప్పడానికి వాళ్ళు తిప్పలు పడి మనల్ని ఇన్ని తిప్పలు పెట్టడం అవసరమా అనిపించింది.
అయితే సినిమా మొత్తమ్మీద నాకు మూడు అంశాలు బాగా నచ్చాయి. ఒకటి actors performance, అంత absurd comedyని కూడా ఎంత సీరియస్ గా, శ్రద్ధగా చేశారో. Evelyn క్యారెక్టర్ చేసిన Michelle Yeoh 60ఏళ్ళు పైబడ్డ నటి. సినిమాలో తను చాలా రకాల స్టంట్స్ చేయాల్సి వచ్చింది. అవన్నీ ఎంత అవలీలగా చేసేసిందని. అందుకేనేమో ఆవిడ బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ గెలుచుకుంది. Evelyn భర్తగా చేసిన Ke Huy Quan బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకున్నాడు. సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. వేర్వేరు విశ్వాలకు చెందిన వేర్వేరు మనుషులుగా ఒకరే చేయాల్సి రావడం వల్ల సహజంగానే ప్రతి ఒక్కరికి బాగా నటించే స్కోప్ దొరికింది.
ఇక నాకు నచ్చిన రెండో అంశం action sequences. భిన్నంగా choreograph చేసినట్లుగా అనిపించాయి. Michelle తన performanceతో ప్రతి యాక్షన్ సీన్ ని బాగా రక్తి కట్టించింది.
సినిమాలో నన్ను ఆకట్టుకున్న మూడో అంశం ఎడిటింగ్. Evelyn, Joy మల్టీవర్స్ లోని అన్ని విశ్వాలను ఒకేసారి తిరిగేసి వచ్చే scenes మంచి editing వల్లే బాగా పండాయి. అన్నట్టు ఈ సినిమా editing కేటగిరీలో కూడా ఆస్కార్ గెలుచుకుంది. Best picture, Best director, best screenplay సహా మొత్తం 11 నామినేషన్లకు గాను ఈ సినిమా 7 అవార్డులను సొంతం చేసుకుంది.
నా మటుకు నాకు స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్తగా రాసుకుని ఉండాల్సింది అనిపించింది. రెండుసార్లు చూసినా ఈ సినిమా ఏం చెప్పదలచుకుందో ఇతమిద్ధంగా అర్థం కాలేదు మరి!.
కొసమెరుపు:
అసలీ సినిమాలో అన్ని ఆస్కార్లు గెలుచుకునే గొప్పతనమేముందబ్బా అని నాలో నేనే గొణుక్కుంటుంటే నాతో పాటే సినిమా చూసిన మా బాబు “నాటు నాటు పాటకు ఎలా వచ్చిందో దీనికీ అలాగే వచ్చి ఉంటుందిలేమ్మా” అనేసి పోయాడు. నిజమే కదా!
శాంతి ఇషాన్, సీనియర్ జర్నలిస్ట్