జీవితంలో కొందరు ప్రతిభ, స్వయంకృషితో పైకి వస్తారు. ఇంకొందరు అదృష్టంతో పైకి ఎదుగుతారు. ఎలా ఎదిగినప్పటికీ లైఫ్ లో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని నిలబడిన వాడే విజేత గా కొనసాగుతాడు. చాలామంది ప్రతిభ, అదృష్టం రెండు ఉన్నా కూడా కేవలం అహంకారంతో జీవితాలు నాశనం చేసుకుంటారు లేదా అభాసుపాలు అవుతుంటారు. ఇప్పుడు నటుడు, నిర్మాత మోహన్ బాబు పరిస్థితి అలాగే ఉంది.
అపారమైన నటన అనుభవం.500 కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక సొంత ఇమేజ్ సంపాదించుకున్న వాడు మంచు మోహన్ బాబు. ఆయన అసలు పేరు భక్తవత్సలా నాయుడు. చిత్తూరు జిల్లాలో డ్రిల్ మాస్టర్ గా అత్యంత పేద కుటుంబం నుంచి ఎదిగి, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి… విలన్ రోల్స్ చేస్తూ… హీరో స్థాయికి ఎదిగాడు మోహన్ బాబు. డైలాగ్ డెలివరీలో గానీ… నటనలో గాని… మేనరిజం లో గాని మోహన్ బాబు పందా వేరు. అంతేకాదు నిర్మాతగా అనేక ప్రయోగాలు చేశాడు. సక్సెస్ అయ్యాడు. రాజ్యసభ సభ్యుడిగా పేరు సంపాదించాడు. ఎన్టీ రామారావు, దాసరి నారాయణరావు ఇద్దరికీ అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. 2007లోనే పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. అలాగే మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ,మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీయు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నత విద్యాసంస్థలు గా నిలిచాయి.అంతేకాదు క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు. ప్రొఫెషన్ లో ఇంత గొప్ప ట్రాక్ రికార్డ్…, స్పష్టమైన విధానాలు ఉన్న ఎం బి తన అహంకారం, నోటి దురద, సొంత డబ్బా తో తరచూ నవ్వుల పాలవుతూ ఉంటాడు. మోహన్ బాబు ఒక్కడే కాదు ఆయన కుటుంబం అంతా ఇండస్ట్రీలోనూ, జనంలోనూ ఒక కామెడీ ఫ్యామిలీ గా మిగిలిపోయింది.
ఇండస్ట్రీలో మోహన్ బాబు చుట్టూ ఉన్న వివాదాలు అన్ని ఇన్ని కావు. అతి మాటలు, అతి ప్రేలాపనలు, సొంత డబ్బా కొట్టుకోవడం, సీనియర్ నటుల్ని, తోటి ఆర్టిస్టులని పదేపదే విమర్శించడం, తనకంటే గొప్పవాడు లేడని బహిరంగంగా తానే చెప్పుకోవడం ఒకటి కాదు… చివరికి మనిషివా? మోహన్ బాబు వా? అనే నానుడి పూట్టేటంతగా మోహన్ బాబు వివాదాల సృష్టించుకున్నాడు.
అక్కినేని నాగేశ్వరావుకు సన్మానం జరుగుతున్న సందర్భంలో స్టేజి ఎక్కి ఏఎన్ఆర్ భార్య అన్నపూర్ణ…. అక్కినేని కంటే మోహన్ బాబే గొప్ప నటుడిని తనతో చెప్పారని ఒక వెకిలి వాదన లేవనెత్తాడు మోహన్ బాబు. దానికి అదే వేదికపై అన్న చిరంజీవి, అక్కినేని నాగేశ్వరావు ఇద్దరు సరిగ్గా ఎంబి మొఖం వాచిపోయేటట్లు సమాధానం ఇచ్చారు. వేదిక నెక్కిన ప్రతిసారి ఏదో ఒక ప్రగల్బాలు పలకడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సూటిపోటి మాటలతో తోటి నటులని కించపరచడం, అసలు నా అంతటి వాడు లేడు అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం ఒకటి కాదు మోహన్ బాబు చేసే రచ్చ. చివరకు మోహన్ బాబుని సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూసెన్స్ ఫెలో గా అందరూ ఫీలవుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఫంక్షన్స్ కి, సినిమా కార్యక్రమానికి మోహన్ బాబు ని ఎవరు పిలవరు. మోహన్ బాబు ఆయన సొంత సినిమాలకు ఆయనే చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. వేదికలెక్కి మోహన్ బాబుని ఆయన పిల్లలు పొగుడుతారు. ఆయన పిల్లల్ని మోహన్ బాబు పొగుడుతారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీ మంచుకి ఆస్కార్ రావాల్సిందేనని మోహన్ బాబు చేసిన ప్రకటన ఇండస్ట్రీని ,జనాన్ని ఇప్పటికీ నవ్విస్తూనే ఉంది. పెదరాయుడు షూటింగ్లో సీనియర్ నటి జయంతిని చాచి లెంపకాయ కొట్టి పెద్ద వివాదమే తీసుకొచ్చాడు మోహన్ బాబు. ఇది ఒకటే కాదు షూటింగ్ సెట్లో తోటి నటులతో చాలాసార్లు మోహన్ బాబు గొడవపడ్డ సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు మంచు విష్ణు మొదటి సినిమా విష్ణు షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ శిల్పా శివానంద మంచు విష్ణు నీ ముద్దు పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేశాడు మోహన్ బాబు. అందుకు ఆమె నిరాకరించడంతో ఏకంగా కిడ్నాప్ చేసాడు కలెక్షన్ కింగ్. చివరికామె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఒకానొక సమయంలో బ్రహ్మానందం పై కూడా మోహన్ బాబు చేయి చేసుకున్నాడని ఇండస్ట్రీలో టాక్. షూటింగ్ స్పాట్ లో మోహన్ బాబు సృష్టించిన ఇలాంటి వివాదాలు గొడవలు, కోకొల్లలు .
2007లో తెలుగు ఇండస్ట్రీ వజ్రోత్సవాలు లో మోహన్ బాబు చేసిన రచ్చ అంతా కాదు. చిరంజీవికి లెజెండ్ అవార్డు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏకంగా అంత పెద్ద కార్యక్రమాన్ని రసాభాస చేసి పడేశారు మోహన్ బాబు. అసలు లెజెండ్ ఎవడు? సెలబ్రిటీ ఎవడు? అంటూ మూలాల్లోకి వెళ్లిపోయారు. నాకేం తక్కువ? నాకెందుకు లెజెండ్ అవార్డు ఇవ్వరు అంటూ నా నా…. యాగీ చేశారు. చివరికి చిరంజీవి ఆ అవార్డు తీసుకోకుండానే దానిని ఒక పెట్టే లో పెట్టి వదిలేసారు. ఆ వివాదం ,ఆ తర్వాత జి అవార్డ్స్ లో కూడా కొనసాగింది. అది పవన్ కళ్యాణ్…. మోహన్ బాబు మధ్య వ్యక్తిగత వివాదాలకు కూడా దారి తీసింది.
మొదట్లో ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ఉంటూ ఆ తర్వాత చంద్రబాబు వైపు చేరిపోయాడు మోహన్ బాబు. అక్కడ కూడా ఆయన వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడింది. తనను ఉపయోగించుకొని ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడని ఆ తర్వాత నన్ను పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పై బహిరంగంగానే విమర్శలు చేసి క్రమంగా టిడిపికి దూరం అయ్యాడు మోహన్ బాబు.2019 ఎన్నికల్లో వైసీపీలో దూరాడు. జగన్కు అనుకూలంగా ప్రచారం చేశారు. కానీ మోహన్ బాబు సంగతి తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దూరం పెట్టాడు జగన్. ఒకానొక సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ తీసి వైసీపీతో కూడా సున్నం పెట్టుకున్నాడు మోహన్ బాబు.
నటి సౌందర్య తో కొన్ని చిత్రాల్లో నటించిన మోహన్ బాబు ఆ సాన్నిహిత్యంతో ఆమె తో హైదరాబాద్ జలపల్లి లో అప్పట్లో కొన్ని భూములు కొనిపించాడంట. సౌందర్య చాపర్ ప్రమాదంలో హఠాత్తుగా కన్ను మూయడంతో ఆ భూములను మోహన్ బాబు స్వాధీనం చేసుకున్నాడని, వాటి విలువ ఇప్పుడు వందల కోట్లు ఉంటుందని…. ఇప్పుడు మోహన్ బాబు అనుభవిస్తున్న కొన్ని ఆస్తులు సౌందర్యవేనని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.
తన వృత్తి విషయంలో ఎంతో క్రమశిక్షణతో… గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు తన పిల్లలు ముగ్గురిని మంచి నటులుగా తీర్చిదిద్దలేకపోయాడు. మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ముగ్గురు ఫెయిల్యూర్ యాక్టర్స్ గా మిగిలిపోయారు. చెప్పుకోడానికి ముగ్గురికి గట్టిగా ఒక్క సినిమా కూడా లేదు. వాళ్ళ ముగ్గురిని మహానటుల్ని చేయడానికి మోహన్ బాబు రకరకాల ప్రయత్నాలు చేశాడు. సహజంగానే టాలెంటెడ్ కాకపోవడం, తగిన హార్డ్ వర్క్ లేకపోవడంతో ముగ్గురు నటులుగా నిలదొక్కుకోలేకపోయారు . దీనికి తోడు అప్పుడప్పుడు ఈ ముగ్గురు చేసే వివాదాస్పద కామెంట్లు, ఓవరాక్షన్ జనం దృష్టిలో వీళ్లు థర్డ్ గ్రేడ్ సెలబ్రిటీలుగా మార్చేశాయి. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ట్రోల్ అయ్యే కుటుంబం పంచు ఫ్యామిలీ ఏ. మోహన్ బాబు సహనటులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ కెరీర్లో అత్యున్నత స్థాయి ఎదగడమే కాకుండా వాళ్ల నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, లాంటివాళ్ళు జాతీయ స్థాయికి ఎదిగారు. వాళ్ల వయసు వాళ్లే అయినా మంచు విష్ణు, మనోజ్ లు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ఎక్కడపడితే అక్కడ ఎలా పడితే అలా అతిప్రాలాపన, అతి వేషాలు మంచు హీరోలను సొసైటీలో జీరో లు గా మార్చేసింది. ఆ ఫ్రస్టేషన్ మోహన్ బాబు లో బాగా కనిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి పదేపదే తన పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి సిగ్గు లేకుండా సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. దీనివల్ల ఇండస్ట్రీలో, జనంలో మోహన్ బాబు కుటుంబం అంటే ఒక చులకన ఏర్పడిపోయింది. సినిమా వాళ్ళ పెళ్లిళ్లు లోనూ, ఫంక్షన్స్ లోనూ మోహన్ బాబు వచ్చి వెళ్లే వరకు అందరూ టెన్షన్ లోనే ఉంటారు. ఎవడో ఒకడిని ఏదో ఒకటి అని రచ్చ చేసి వెళ్తాడని, ఆయన ఒక న్యూసెన్స్ ఫెలో అని ఫీలవుతుంటారు ఇండస్ట్రీ వాళ్ళు.
ఇండస్ట్రీకి తానే ఒక పెద్ద ని, ఎవడికి ఏ సమస్య వచ్చినా తన కాంటాక్ట్ చేస్తారని స్వయంగా మోహన్ బాబు చెప్పుకోవడమే తప్ప ఎవడు ఎప్పుడు వెళ్లి ఆయన దగ్గర కూర్చున్నది లేదు. మూడేళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్… మా ఎన్నికల్లో విష్ణునీ నిలబెట్టి వైసీపీ సహకారంతో గెలవగలిగారు మోహన్ బాబు కుటుంబం. విష్ణు కి వ్యతిరేకంగా నిలబడిన ప్రకాష్ రాజ్ కి చిరంజీవి మద్దతు పలికినప్పటికీ ఓటమి తప్పలేదు. మా ఎన్నికల్లో గెలుపుని చూసుకొని అసలు మొత్తం ఇండస్ట్రీ మొత్తం తన గుప్పెట్లో ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాడు మోహన్ బాబు, మంచు విష్ణు. మోహన్ బాబు కి ఆయన కుటుంబ సభ్యులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న భావంలో ఉంటారు మిగతా ఇండస్ట్రీ అంతా.
ప్రధాని నరేంద్ర మోడీ తనకు చాలా సన్నిహితుడని… ఎప్పుడు కావాలంటే అప్పుడు తనని ప్రధాని కార్యాలయానికి, ఇంటికి వచ్చి వెళ్ళమని మోడీ చెప్తారని ….ఇలాంటి డబ్బా కబుర్లు ఇంటర్వ్యూలో చెప్పి మరింత అభాసు పాలయ్యాడు మోహన్ బాబు.
ఇప్పుడు మరోసారి కుటుంబ వివాదాన్ని రచ్చ చేసుకుని నలుగురు నవ్వుకునేటట్లు రోడ్డును పడ్డారు మంచు ఫ్యామిలీ. ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని అన్నదమ్ములు గొడవలను పరిష్కరించుకోవాలనుకున్నంత స్థాయికి దిగజారారు. కొడుకుని కూర్చోబెట్టుకుని సమస్యను పరిష్కరించుకోవలసిన మోహన్ బాబు ప్రపంచం మొత్తానికి తెలిసేటట్లుగా మంచు మనోజ్ ని అడ్రస్ చేస్తూ ఒక ఆడియో రిలీజ్ చేసి అక్కడ కూడా పప్పులో కాలేశారు. చివరికి ఒక ఛానల్ రిపోర్టర్ ను కొట్టి ఈ వివాదాన్ని మరింత కంపు చేసుకున్నారు మోహన్ బాబు. ఇండస్ట్రీ మొత్తం మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తోంది. కానీ ఎవరు ఆ దరిదాపులు కూడా వెళ్లలేదు.
నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా రాణించిన మోహన్ బాబు ఒక తండ్రిగా, వ్యక్తిగా మాత్రం అట్టర్ ఫెయిల్ అయ్యారు. అంతేకాదు నోటి దురద, సొంత డబ్బా, అతిప్రాలాపన తో ఇండస్ట్రీలోనూ, సొసైటీలోనూ చివరికి ఒక జోకర్ గా మిగిలిపోయారు. ఇది ద ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ మోహన్ బాబు.