ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక హీరో ఫ్యాన్స్ కి మరో హీరో ఫ్యాన్స్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. హీరోలు హీరోలు రాసుకు పూసుకు తిరిగినా ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఫైర్ లో ఉండేవారు. స్టార్ హీరో లేదు చిన్న హీరో లేదు మన టాలీవుడ్ లో మాత్రం ఎప్పుడూ ఈ వాతావరణమే చూసాం. అందుకే హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలంటే భయపడ్డారు. అయితే గత పదేళ్ళ నుంచి పరిస్థితి మారిపోయింది. ఒక హీరో ఆడియో రిలీజ్ కి మరో హీరో, ఒక హీరో సక్సెస్ మీట్ మరో హీరో ఇలా వెళ్ళడం… బావా, బామ్మర్ది, అన్నా అని పిలుచుకోవడం కాస్త ఫ్యాన్స్ కి నచ్చి వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది.
ఈ మధ్య కాలంలో మనం బాగా చూసిన స్నేహం అల్లు అర్జున్, ఎన్టీఆర్ ది. అసలు మెగా నందమూరి ఫ్యాన్స్ కి పడే సీన్ లేదు. కాని ఈ ఇద్దరూ ఫ్యామిలి ఫ్రెండ్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో వీళ్ళ హడావుడి మాములుగా ఉండదు. అది చూసి ఫ్యాన్స్ కి కూడా పూనకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంకాస్త ముదిరింది. ఏకంగా పవన్ కళ్యాణ్ నే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే వరకు వెళ్ళింది. తాజాగా… అడవులు నరికి స్మగ్లింగ్ చేసే సినిమాలు హీరోలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కాస్త ఘాటు కామెంట్స్ చేసారు.
అల్లు అర్జున్… సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో హీరో చేసే పని అదే. పవన్ చేసిన కామెంట్స్ బన్నీ ఫ్యాన్స్ కి మండితే ఓకే గాని… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా మండింది. ఎక్స్ లో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. మీ మెగా ఫ్యామిలీ ఇంతే… ఇంకొకడు పైకి వస్తే చూడలేరు అంటూ పవన్ ని తిట్టారు. అది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తిట్టడం మొదలుపెట్టారు. అసలు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదా… అంటూ మొదలుపెట్టి డోస్ పెంచి బూతులు మాట్లాడుకున్నారు.
మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్… బన్నీకి అండగా నిలబడటానికి కారణం ఏంటో తెలియదు గాని… బన్నీ మీద మెగా ఫ్యామిలీ సీరియస్ గా ఉంది. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసి ప్రచారం చేసాడని… అది మనసులో పెట్టుకుని పవన్ కామెంట్ చేసి ఉండవచ్చు. టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన వాల్యూ ఎన్టీఆర్ కు ఇవ్వడం లేదనే కోపంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండి ఉండవచ్చు అంటున్నారు నెటిజన్లు.