విజయవాడ వరదల దెబ్బకు ప్రజలు అల్లాడిపోయారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా వరదలు తమ ప్రభావాన్ని చూపించాయి. ఖమ్మం జిల్లాలో భారీ వరదలు కన్నీళ్లు మిగిల్చాయి. ఇప్పుడే వరదలు క్రమంగా తగ్గడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వరద ముంపు నుంచి బయటకు తెచ్చేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నాయి. ఇదే సమయంలో సినిమా పరిశ్రమ, పారిశ్రామిక వేత్తలు ఇలా అందరూ ముందుకు వచ్చి రాష్ట్రానికి తమ వంతు సాయం అందిస్తున్నారు.
ఎన్నడూ లేని విధంగా సినిమా పరిశ్రమ నుంచి భారీ ఎత్తున సాయం రెండు రాష్ట్రాలకు అందిన సంగతి తెలిసిందే. నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి సాయం చేస్తున్నాయి. అలాగే చిన్నా పెద్ద హీరోలు అందరూ రాష్ట్రానికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమ నుంచి కూడా తెలుగు నేలకు సాయం అందింది. తమిళ స్టార్ హీరో శింబు తన వంతు సాయం చేసాడు. రెండు రాష్ట్రాలకు చెరో మూడు లక్షలు ఆర్ధిక సాయం అందించాదు శింబు.
ఇతర భాషల నుంచి తెలుగు ప్రజలకు అందిన సాయం ఇదొక్కటే. హిందీతో పాటుగా తమిళ, మలయాళం, కన్నడ సినిమాలకు మన తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడి స్టార్ హీరోల సినిమాలు ఇక్కడ భారీగానే వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాని వాళ్ళు మాత్రం సాయం చేయడానికి ముందుకు రాకపోవడం అందరిని విస్మయానికి గురి చేసే అంశంగా చెప్పాలి. చివరికి ఓటీటీలలో కూడా సినిమాలకు మంచి స్పందన వస్తోంది. కాంతారా, విక్రం, జైలర్, ఖైదీ వంటి సినిమాలు మన తెలుగులో ఏ స్థాయిలో వసూలు చేసాయో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా పేరుతో ఇక్కడ సినిమాలను విడుదల చేసి లాభాలను ఆర్జించే నిర్మాతలు కూడా ఆసక్తి చూపకపోవడం ఆవేదన కలిగించే అంశం.