pushpa-villain : ‘పుష్ప’ విలన్‌ పై కేసు నమోదు..

ఫహాద్‌ ఫాజిల్‌ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ ‘పుష్ప’ విలన్‌ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా చివర్లో ‘పార్టీ లేదా పుష్ప’ అన్న డైలాగ్‌ తో తెగ ఫేమస్‌ అయ్యాడు.

ఫహాద్‌ ఫాజిల్‌ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ ‘పుష్ప’ విలన్‌ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా చివర్లో ‘పార్టీ లేదా పుష్ప’ అన్న డైలాగ్‌ తో తెగ ఫేమస్‌ అయ్యాడు. ఈ సినిమాలో ఫహాద్ కనిపించింది కొద్ది సమయమే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫాజిల్‌ స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి హిట్‌ కొడుతున్నారు. ఇటీవల ‘ఆవేశం’ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు. తాజాగా… ఈ నటుడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు నమోదు చేసింది.

ఫాజిల్‌ …‘పింకేలీ’ షూటింగ్‌ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించాడు. రెండ్రోజుల క్రితం అక్కడ రాత్రంతా షూటింగ్‌ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బందిపడ్డారు. ఎమర్జన్సీ రూంలోనూ షూటింగ్‌ చేయడంతోపాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అసలు అత్యవసర విభాగంలో సినిమా షూట్‌ కోసం ఎలా పర్మిషన్‌ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి మండిపడ్డారు. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఓవైపు ఆసుపత్రిలో రోగులకు చికిత్స జరుగుతూ ఉండగానే… మరోవైపు షూటింగ్‌ చేశారని, దీని వల్ల రోగులు చాలా ఇబ్బందులుపడ్డారని పలువురు ఆరోపణలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కూడా ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా షూటింగ్‌ కోసం అడ్డుకున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే… నిర్మాతల సంఘం మాత్రం ఈ ఆరోపణలన్నిటినీ కొట్టిపారేసింది. రాత్రి ఆసుపత్రిలో షూటింగ్‌ కోసం 10 వేలు చెల్లించామని చెప్పుకొచ్చి సమర్థించుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.. నిర్మాత ఫహాద్‌ ఫాజిల్‌ పై కేసు పెట్టింది. దీంతో ఇతడు త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.