Ilaiyaraaja: ఇళయరాజా అంటే సినీ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనం. ఒకప్పుడు ఇళయరాజా అంటే సంగీత ప్రియులు దైవంగా ఆరాధించేవారు. ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవారు. ఒక దశలో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా దక్షిణ భారత సినీ సంగీతాన్ని శాసించారు. అయితే కాలం మారుతున్న కొద్దీ అభిరుచులు మారతాయి, కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తూ ఉంటుంది. సహజంగానే ఎంత గొప్ప సంగీతకారుడైనా మరుగున పడిపోక తప్పదు.
Samantha : ఆయనతో బంధం ఎప్పుడూ ప్రత్యేకమే
ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఇళయరాజా ఛరిష్మా ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. సినిమాలు ఎక్కువగా చెయ్యకపోయినా ఏదో ఒక వివాదంలో అప్పుడప్పుడు ఆయన వార్తల్లోకి వస్తూనే ఉంటారు. కొన్నాళ్ల క్రితం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో పాటల విషయంలో వివాదం ఏర్పడి కోర్టు కేసుల వరకు వెళ్లారు. తన పాటలను వివిధ సంగీత విభావరుల్లో పాడుతున్నాడని, తద్వారా డబ్బు బాగా సంపాదించుకుంటున్నాడని ఆరోపించారు. తన పాటలను స్టేజ్‌లపై పాడుతున్నందుకు తనకు రాయల్టీ చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు ఇళయరాజా. ఇప్పుడు మరో వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలిచారాయన. 80, 90 దశకాల్లో ఇళయరాజా పాటలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అప్పట్లో క్యాసెట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రముఖ సంగీత దర్శకుల పాటలను విడుదల చేసేందుకు వివిధ క్యాసెట్ కంపెనీలు పోటీలు పడేవి. ఆడియో రైట్స్‌ను ఆక్షన్ ద్వారా ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకునేవారు.
Pushpa2 : వెయ్యి కోట్లతో ‘పుష్ప 2’ సంచలనం
ఆ సమయంలో ఇళయరాజా స్వరపరచిన పాటలు ఎకో రికార్డింగ్ కంపెనీ ద్వారా మాత్రమే విడుదలయ్యేవి. మరో కంపెనీని దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఎకో రికార్డింగ్ కంపెనీ ఇళయారాజా సొంత కంపెనీ అనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. తాజాగా ఈ కంపెనీపైనే ఆయన కోర్టులో కేసు వేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎకో సంస్థతోపాటు మరికొన్ని సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా తన పాటలను వాడుకుంటున్నాయని, ఆ సంస్థలతో చేసుకున్న ఒప్పందం గడువు ముగిసిపోయిందని, కాబట్టి కాపీరైట్స్ తనకు తిరిగి ఇచ్చెయ్యాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇళయరాజా. దీనిపై ఆయా సంస్థలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. కేసును విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పాటలను వాడుకొనే హక్కు ఆయా సంస్థలకు ఉందని స్పష్టం చేసింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇళయారాజా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించే క్రమంలో తన క్లయింటు ఇళయారాజా గొప్పతనాన్ని గురించి చెబుతూ ఆయన అందరి కంటే గొప్పవాడు అని పేర్కొన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు.. ఇళయరాజా అందరి కంటే గొప్పవాడు కాదని స్పష్టం చేసింది. ఇళయరాజాపై న్యాయవాది వెలిబుచ్చిన అభిప్రాయాలపై కోర్టు స్పందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకుడు అయి ఉండొచ్చు. అంత మాత్రాన గొప్పవారు అని చెప్పడాన్ని అంగీకరించబోమని చెన్నయ్ హైకోర్టు తేల్చి చెప్పింది. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా కీర్తికెక్కిన ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజన్, శ్యామశాస్త్రిలను గొప్పవారిగా చెప్పుకోవాలని, వారి కంటే ఇళయరాజా గొప్పవారు కాదని కోర్టు నొక్కి వక్కాణిస్తూ ఈ కేసును ఈనెల 24కి వాయిదా వేసింది.