ఈ జనరేషన్ లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే ప్రధానంగా ఆరుగురి పేర్లు వినిపిస్తాయి. వారే పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. వీరి నుంచి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తారు. అయితే ఈ ఏడాది ఆరుగురు స్టార్లలో నలుగురి నుంచి కనీసం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది జూన్ 16న ‘ఆదిపురుష్ తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. డిసెంబర్ 22న ‘సలార్’తో మరోసారి సందడి చేయనున్నాడు. అలాగే జులై 28న ‘బ్రో’ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నుంచి మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు.
మహేష్ గత చిత్రం ‘సర్కారు వారి పాట’ 2022 మేలో విడుదలైంది. అప్పటి నుంచి ఏడాదిన్నరగా మహేష్ కొత్త చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2010 నుంచి గమనిస్తే 2020 వరకు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వచ్చాడు మహేష్. లాక్ డౌన్ కారణంగా 2021లో ఆయన నుంచి సినిమా రాలేదు. 2023లో కూడా మహేష్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే ఆయన తదుపరి చిత్రం ‘గుంటూరు కారం’ 2024 ప్రారంభంలోనే జనవరి 12న విడుదలవుతుండటం ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే విషయం.
ఇతర స్టార్ హీరోలకి సాధ్యంకాని విధంగా కెరీర్ స్టార్టింగ్ నుంచి జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ దూకుడు కి ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా బ్రేకులు పడ్డాయి. 2018లో ‘అరవింద సమేత తో అలరించిన తారక్.. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లు 2022 లో ‘ఆర్ఆర్ఆర్’తో సందడి చేశాడు. కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ మూవీ ‘దేవర’ను స్టార్ట్ చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకున్న ఎన్టీఆర్.. 2023లో సినిమా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. ఆయన నటిస్తున్న ‘దేవర’ చిత్రం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది.
2021 డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్ తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా పుష్ప రెండో భాగంగా రానున్న ‘పుష్ప: ది రూల్’ పైనే పెట్టాడు. దాంతో 2022, 2023 సంవత్సరాలలో థియేటర్లలో బన్నీ సందడి లేకుండా పోయింది. పుష్ప-2 మూవీ 2024 ఆగస్టు 15న థియేటర్లలో అడుగు పెట్టనుంది. 2022లో ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో సందడి చేసిన రామ్ చరణ్.. 2023లో ‘గేమ్ ఛేంజర్’తో అలరించాలి అనుకున్నాడు. కానీ దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’ సినిమాతో బిజీగా ఉండటంతో.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ బాగా ఆలస్యమవుతూ వస్తుంది. దాంతో కనీసం 2024లో అయినా తమ హీరో సినిమా విడుదలైతే చాలని చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.