మెగాస్టార్ చిరంజీవి లాంటి శిఖరానికి నట వారసుడిగా పరిచయమై.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. స్టార్డం విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని సత్తా చాటుతున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం.. తన తండ్రి చిరంజీవికి చరణ్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేడు.
2007లో వచ్చిన ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రామ్ చరణ్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక హీరోగా చేసిన రెండో సినిమా ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకొని, సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఎవడు’, ‘ధృవ’ వంటి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ‘రంగస్థలం’తో భారీ బ్లాక్ బస్టర్ ను సాధించడమే కాకుండా.. తనలోని అసలుసిసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇలా సినిమా సినిమాకి చరణ్ తన స్టార్డమ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయినప్పటికీ ఒక విషయంలో ఆయన పట్ల మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అదేంటంటే చిరంజీవితో పోలిస్తే.. చరణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు.
చిరంజీవి ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు చేతి నిండా సినిమాలు ఉండేలా చూసుకునేవారు. రోజుకి రెండు షిఫ్ట్ లు పని చేస్తూ.. ఒకేసారి పలు సినిమాల షూటింగ్ లు పూర్తిచేసేవారు. ఏడాదికి కనీసం అర డజను నుంచి డజను సినిమాలు విడుదల చేసేవారు. అందుకే రాజకీయాల కారణంగా ఎనిమిదేళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ.. తన తోటి అగ్ర నటులకు సాధ్యంకాని విధంగా 150 కి పైగా సినిమాలు చేశారు. స్టార్ కి ఎన్నో కమర్షియల్ లెక్కలు ఉంటాయి. వాటిని దాటుకొని చిరంజీవి లాంటి బిగ్ స్టార్ 150 కి పైగా సినిమాలు చేయడం మామూలు విషయం కాదు.
అయితే స్టార్డం విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్.. సినిమాల కౌంట్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా వెనకబడిపోయాడు. 17 ఏళ్ళ సినీ కెరీర్ లో చరణ్ నుంచి ఇప్పటిదాకా 14 సినిమాలే వచ్చాయి. అంటే ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ముందు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో, మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా.. నెలలు, సంవత్సరాలు తరబడి తెరకెక్కుతున్నాయి. దీంతో ఏడాదికి ఒక సినిమా విడుదలైతే గగనమే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ లెక్కన రామ్ చరణ్ తన కెరీర్ మొత్తంలో 50 సినిమాలు చేసినా గొప్పే. ఇక 100 సినిమాలు అనే మాట అయితే ఆలోచించకపోవడమే ఉత్తమం. ఏది ఏమైనా తన తండ్రి నుంచి వేగంగా సినిమాలు చేసే గుణాన్ని కూడా చరణ్ అలవరచుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది.