NTR Centenary Celebrations: ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో విజయ పరంపర కొనసాగించి.. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన శతజయంతి వేడుకలను దేశం మొత్తం గుర్తుంచుకునేలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన తనయుడు బాలకృష్ణ స్వయంగా ఓ వీడియో చేసి అభిమానులకు, టీడీపీ కార్యకర్తలను ఆహ్వానించారు.
సినీ ప్రముఖులు, టీడీపీ నేతలు అంతా ఈ వేడుకకు హాజరవుతున్నారు. పక్క ఇండస్ట్రీకి చెందిన రజినీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కానీ నందమూరి కుటుంబానికి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు గానీ, ప్రస్తావన గానీ ఎక్కడా లేదు. అసలు జూనియర్‌కు ఆహ్వానమే అందలేదని టాక్. వాళ్లు వస్తున్నారు.. వీళ్లు వస్తున్నారు అంటూ హడావిడి చేస్తున్నారు తప్ప ఆహ్వానితుల జాబితాలో తారక్ పేరు ఎక్కడా వినిపించడంలేదు. తారక్ ఉత్సవాలకు వస్తే కనీసం టీడీపీ నేతలు అయినా సోషల్ మీడియాలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేవాళ్లు. కానీ టీడీపీ నుంచి కూడా నో రెస్పాన్స్. దీంతో జూనియర్‌ను నందమూరి కుటుంబం ఇంకా దూరం పెడుతోంది అనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. నందమూరి కుటుంబంలో ఉన్న వివాదం తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు.
నందమూరి హరికృష్ణ రెండో భార్య కొడుకు జూనియర్ ఎన్టీఆర్. ఈ కారణంగానే ఆ ఫ్యామిలీ జూనియర్‌ను ఎప్పుడూ దూరంగానే ఉంచింది. దక్కాల్సిన గౌరవం దక్కకుండా చేసింది. కానీ ఆయన తాత ఎన్టీ రామారావు మాత్రం.. తన మనవళ్లలో ఎవరికీ ఇవ్వని స్థానం జూనియర్‌కు ఇచ్చారు. స్వయంగా తన పేరునే పెట్టి ఆశీర్వదించారు. తాత ఆశీర్వాదంతో నందమూరి కుటుంబంలో మరో ఎన్టీఆర్‌గా ఎదిగాడు తారక్. సినిమాల్లో తనను ఎవరు ఆపాలని ప్రయత్నించినా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. వరుస విజయాలతో టాప్ హీరోగా మారాడు. ట్రిపులార్ సినిమాతో నందమూరి పేరును తాత తరువాత మరోసారి విశ్వవ్యాప్తం చేశాడు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని, చరిష్మాను ఆ ఫ్యామిలీలో క్యారీ చేసిన థర్డ్ జనరేషన్ హీరో కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. బయటికి చెప్పకపోయినా అందరి ఒపీనియన్ ఇదే. కానీ నందమూరి కుటుంబం మాత్రం తారక్‌ను ఎప్పుడూ తమలో ఒకడిగా భావించలేదు. మిగిలిన మనవళ్లకు దక్కిన గౌరవం తారక్‌కు ఎక్కడా దక్కలేదు.
రీసెంట్‌గా తారకరత్న సంతాప సభలో కూడా బాలకృష్ణ ఎన్టీఆర్‌ను కనీసం పలకరించలేదు. తారక్ నిలబడి గౌరవం ఇచ్చినా.. కనీసం అతని వైపు చూడకుండానే వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసి తారక్ ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు. ఆ తరువాత బాలకృష్ణ ఇంట్లో జరిగిన సంతాప కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్‌ను ఆ కుటుంబం ఇంకా దూరం పెడుతోందని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు కూడా తారక్‌ను ఆహ్వానించకపోవడంతో తారక్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ రూపం, ఆహార్యం, ఫ్యాన్ ఫాలోయింగ్ మళ్లీ జూనియర్‌కు మాత్రమే దక్కింది. నిజం చెప్పాలంటే ఆయన మనవళ్లలో తాత వారసత్వం పుణికిపుచ్చుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.
అలాంటి వ్యక్తిని తాత వేడుకకు ఎలా ఆహ్వానించకుండా ఉంటారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు ఫ్యాన్స్. తారక్‌ను మాత్రమే కాదు. నందమూరి కళ్యాణ్‌రామ్‌కు కూడా ఇంకా ఆహ్వానం అందనట్టు సమాచారం. తారక్, కళ్యాణ్ రామ్ మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన ప్రతీ ఈవెంట్‌లో తారక్ ఉండాల్సిందే. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌ను పిలిస్తే ఖచ్చితంగా తారక్‌ను కూడా పిలవాలి. ఈ కారణంగానే కళ్యాణ్ రామ్‌ను కూడా పిలవలేదని సమాచారం. అయితే జూనియర్ మాత్రం ఖచ్చితంగా ఈ ఈవెంట్‌కు వెళ్లాలంటున్నారు అభిమానులు. నందమూరి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ముందుండే జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించకుండా ఎలా ఉంటారని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్లు పిలవకపోయినా ఎన్టీఆర్ తాతగారి ఈవెంట్‌కు వెళ్లాలంటున్నారు. ఆహ్వానం అందకున్నా తాత కోసం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ వెళ్తాడా.. లేదా.. చూడాలి.