Kushi Trailer: హీరో, హీరోయిన్, డైరెక్టర్.. లాస్ట్ మూవీ అందరికీ ఫ్లాపే..! కెరీర్ ఖుషీగా సాగాలంటే.. ఖుషీ మూవీ హిట్ కావాలి. ముగ్గురిది అదే టార్గెట్. మరోవైపు తెలియకుండానే మూవీ మీద అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సెంటిమెట్ టైటిల్ కావడం.. సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేయడంతో.. ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ హైప్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉంది..? సినిమా మీద అంచనాలు పెంచేసిందా..?
ప్రేక్షకులకు థియేటర్స్‌కు రప్పిస్తుందా..? ఓపెన్ చేస్తే కశ్మీర్‌లో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. బేగమ్ అనుకునే బ్రాహ్మిణ్ అమ్మాయిని పడేయాలని విజయ్ దేవరకొండ తెగ కష్టపడుతుంటాడు. కట్ చేస్తే స్టోరీ హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఇద్దరి పెళ్లికి రెండు కుటుంబాల మధ్య వార్.. ఆ తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి.. మ్యారేజ్ తర్వాత అయ్యే గొడవలు.. మధ్యలో ఎప్పుడూ చెప్పే విజయ్ డైలాగులు.. స్టోరీ ఏంటో ఏ మాత్రం దాచుకోకుండా ట్రైలర్‌లోనే మొత్తం చెప్పేశాడు డైరెక్టర్. సినిమా అంతా ఎమోషన్స్ మాత్రమే ఉంటాయని.. ఎమోషన్సే సినిమాను నడిపిస్తాయని ఓ క్లూ ఇచ్చాడు. మరి ఆ ఎమోషన్స్ జనాలకు రీచ్ అవుతుందా లేదా అన్నదే మ్యాటర్. రోజా సినిమాలో చూసినట్లు ఉంది అని ట్రైలర్‌లో హీరో ఓ డైలాగ్ చెప్తాడు. ట్రైలర్ కూడా దాదాపు అలానే ఉంది. ఏదో సినిమాలో ఈ స్టోరీ, ఇలాంటి సీన్ చూశామే అనిపిస్తుది. గీత గోవిందం, అంటే సుందరానికి, ఎఫ్ 2.. ఇలా రకరకాల సినిమాలు గుర్తుకువస్తాయి ట్రైలర్ చూస్తున్నంత సేపు!
మరి ఈ సీన్లు ట్రైలర్‌కే పరిమితం చేశాడా.. సినిమాలోనూ వీటికి కొనసాగింపు ఉంటుందా అన్నది తెలియాలి. ట్రైలర్ చూస్తుంటే.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. పెళ్లంటేనే చావురా అని రాహుల్ రామకృష్ణ చెప్పిన డైలాగ్, భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చెబుతున్నా అని విజయ్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయ్ అంతే! విజయ్, సమంత కెమిస్ట్రీ చాలా చక్కగా ఉంది. నిజంగా మొగుడు-పెళ్లాలు గొడవ పడినట్లే అనిపిస్తుంది కొన్ని సీన్లు చూస్తుంటే. తెలిసిన స్టోరీనే అయినా.. ఎమోషన్స్‌తో నడిపించొచ్చు అనుకొని టక్ జగదీష్‌తో చేతులు కాల్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ మళ్లీ ఇదే తప్పు చేస్తాడా.. కొత్తగా ఆకట్టుకుంటాడా చూడాలి మరి.