మను బాకర్ కు అవమానం, ఖేల్ రత్న నామినేషన్స్ లో మిస్

జాతీయ క్రీడాపురస్కారాలపై వివాదం చెలరేగింది. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న పురస్కారానికి సంబంధించిన నామినేషన్స్ జాబితాలో స్టార్ షూటర్ మనుబాకర్ కు చోటు దక్కలేదు. దీంతో క్రీడాశాఖ తీరు చర్చనీయాంశమైంది. రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మను బాకర్ కు చోటు లేకపోవడం వివాదాస్పదంగా మారింది.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 04:18 PM IST

జాతీయ క్రీడాపురస్కారాలపై వివాదం చెలరేగింది. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న పురస్కారానికి సంబంధించిన నామినేషన్స్ జాబితాలో స్టార్ షూటర్ మనుబాకర్ కు చోటు దక్కలేదు. దీంతో క్రీడాశాఖ తీరు చర్చనీయాంశమైంది. రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మను బాకర్ కు చోటు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ అవార్డు కోసం మను భాకర్ దరఖాస్తు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. కానీ మను బాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ మాత్రం అధికారుల వ్యాఖ్యలను ఖండించాడు. తాము అప్లికేషన్ పెట్టుకున్నట్టు చెప్పారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్ కు మీరిచ్చే గుర్తింపు ఇదేనా అంటూ ప్రశ్నించారు. అథ్లెట్లను ప్రోత్సహించే విధానం ఇది కాదన్నారు. ప్రభుత్వంలోని ఓ అధికారి అన్ని అవార్డల నామినేషన్స్ నిర్ణయించారనీ, మిగతా కమిటీ సభ్యులు సైలెంట్ అయిపోయారంటూ ఆరోపించారు.

తాము దరఖాస్తు చేసుకున్నామనీ, కమిటీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదన్నారు. ఇలాగైతే తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనమని తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహిస్తారని మనుభాకర్ తండ్రి అసహనం వ్యక్తం చేశారు. కాగా మను భాకర్‌కు 2020లో అర్జున అవార్డ్ వచ్చింది. అయితే మను భాకర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండటం, పారిస్ ఒలింపిక్స్ తర్వాత రాహుల్ గాంధీని కలవడంతోనే మోదీ ప్రభుత్వం ఆమెను క్రీడా పురస్కారల్లో నామినేట్ చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో అథ్లెట్లు దరఖాస్తు చేసుకోకున్నా క్రీడా పురస్కారాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అయితే మను బాకర్ విషయంలో షూటింగ్ సమాఖ్య తీరు కూడా విమర్శలు తావిస్తోంది. ఏ క్రీడకు సంబంధించి ఆయా సమాఖ్యలు తమ క్రీడాకారుల పేర్లు క్రీడాశాఖకు సిఫార్సు చేస్తాయి. అయితే షూటింగ్ సమాఖ్య మాత్రం మను బాకర్ ను పక్కన పెట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సారి ఖేల్ రత్న నామినేషన్స్ లో హాకీ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ వ్యక్తిగత ఈవెంట్ తో పాటు మిక్సిడ్ డబుల్స్ లోనూ మెడల్ సాధించింది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. అలాంటి ఘనత సాధించిన అథ్లెట్ విషయంలో క్రీడా శాఖ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అవార్డులు అడుక్కుంటేనే ఇస్తారా… ప్రతిభను చూసి అవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.