మెగా హీరోస్ ని ప్లాప్స్ వెంటాడుతున్నాయి. ఒక్క అల్లు అర్జున్ తప్ప అందరూ ప్లాప్ బాధితులే. ఆ ఒక్కడికి తప్ప మెగా హీరోలందరికీ హిట్ కావాలి. మెగా హీరోల్లో ఫామ్‌లో వుంది ఎవరంటే.. రెండేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టి ఆతర్వాత కనిపించని అల్లు అర్జున్ తప్ప మరో హీరో లేడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. నెల తిరగకుండా ముగ్గురు మెగా హీరోల సినిమాలు రిలీజైతే.. బాక్సాఫీస్‌ను మెప్పించింది ఒక్కటీ లేదు. ఆచార్య.. గాడ్‌ఫాదర్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా బాస్ ఫామ్‌లోకి వచ్చాడు. 136 కోట్లు కలెక్ట్ చేసి ‘అల వైకుంఠపురంలో’ మీదున్న నాన్ ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అయితే ఆ సంతోషాన్ని భోళా శంకర్ ఆవిరి చేసేసింది.
చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే డిజాస్టర్ అనుకుంటే.. భోళా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. మెగా ఇమేజ్‌ను డ్యామేజ్ అయినా.. వాల్తేరు వీరయ్యలా మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతాడన్న నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్‌గా ఒకేసారి రెండు సినిమాలు ఎనౌన్స్ చేయగా.. ఒక మూవీకి డైరెక్టర్ ఇంకా ఫైనల్ చేయలేదు. బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్షన్‌లో నటించే జగదేకవీరుడు అతిలోక సుందరి.. అంజి రేంజ్ లో సోషియో ఫాంటసీ కథలా వుంటుందంటున్నారు. అదేమిటోగానీ.. మెగా హీరోలు చిరంజీవి, పవన్ సినిమాల నష్టం పర్సెంటేజ్ పెరుగుతోంది. పవన్ ఈ ఏడాది బ్రో మూవీతో ముందుకొస్తే.. సినిమా వీకెండ్ కలెక్షన్స్‌కే పరిమితమైంది. సినిమాను 90 కోట్లకు అమ్మితే.. 70 కోట్లు కూడా రాలేదు.
మామా మేనల్లుడు చిరంజీవి, సాయిధరమ్ తేజ్‌ది ఒకే పరిస్థితి. ఈఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చిన మెగాస్టార్ సంక్రాంతి మొనగాడు అనిపించుకుంటే.. భోళా శంకర్ గాలి తీసేసినట్టయింది. తేజు విరూపాక్షతో దాదాపు 100 కోట్ల గ్రాస్ దాకా వెళ్లి.. మేనమామ పవన్ అండతో హిట్ కొడదామనుకుంటే.. కుదర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌తో రామ్‌చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్ అయ్యాడు. శంకర్ చేతిలో పడ్డాడు ఇంకేముందనుకుంటే.. ఆచార్య ఈ మెగా హీరోను నిరుత్సాహానికి గురిచేసింది. చెర్రీ సక్సెస్ చూడాలంటే.. ‘గేమ్ ఛేంజర్’ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
వైష్ణవ్‌తేజ్ ఉప్పెనతో అదిపోయే ఎంట్రీ ఇచ్చినా.. రెండో సినిమా కొండపొలం నిరాశపరిచింది. ‘రంగ రంగ వైభవంగా’ వచ్చినా.. సక్సెస్ వైభవం మాత్రం దక్కలేదు. నవంబర్‌లో వస్తున్న ఆదికేశవపై ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. గద్దలకొండ గణేశ్ తర్వాత సరైన సక్సెస్ చూడలేకపోయాడు. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా.. విజయం మాత్రం వరించడం లేదు.