ఆడియో తో వచ్చిన సానుభూతి… దాడి తో పోయింది..

ఈ ప్రపంచంలో డబ్బు మహా చెడ్డది… అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రి కొడుకులను, తల్లి బిడ్డలను కూడా వేరు చేయగలిగే సామర్థ్యం ఒక డబ్బుకు మాత్రమే ఉంది. ఇప్పుడు మంచు కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు యుద్ధం ఎప్పుడో పురుడు పోసుకున్నా... ఇప్పుడు మాత్రం అతిపెద్దదిగా, అత్యంత పెద్దదిగా... మహా పెద్దదిగా కనపడుతుంది.

  • Written By:
  • Publish Date - December 11, 2024 / 08:59 PM IST

ఈ ప్రపంచంలో డబ్బు మహా చెడ్డది… అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రి కొడుకులను, తల్లి బిడ్డలను కూడా వేరు చేయగలిగే సామర్థ్యం ఒక డబ్బుకు మాత్రమే ఉంది. ఇప్పుడు మంచు కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు యుద్ధం ఎప్పుడో పురుడు పోసుకున్నా… ఇప్పుడు మాత్రం అతిపెద్దదిగా, అత్యంత పెద్దదిగా… మహా పెద్దదిగా కనపడుతుంది. డబ్బు కోసం మాత్రమే ఈ యుద్ధం జరుగుతోందనే విషయం ప్రపంచం మొత్తానికి ఒక స్పష్టత ఉంది. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న మంచు కుటుంబం, సినిమా పరిశ్రమలోనే అత్యంత ప్రతిభావంతుడు, అత్యంత సీనియర్ నటుడు ఆయన మోహన్ బాబు కుటుంబంలో డబ్బు తెచ్చిన చీలిక ఆ కుటుంబ పరువును బజారుకీడ్చింది.

ఇన్నాళ్లు ఎన్నో గొడవలు జరిగినా ఈ స్థాయిలో రోడ్డుకి ఎక్కి… నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ చూసుకున్న పరిస్థితి ఏ రోజు లేదు. ఎప్పుడైనా చిన్న గొడవలు వస్తే వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించే మోహన్ బాబు ఇప్పుడు రోడ్డు ఎక్కారు. పెద్ద కొడుకు మంచు విష్ణుకు అలాగే తన కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు ఆస్తులు పంచేందుకు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారనే విషయం బయటకు రావడం… తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో మంచు మనోజ్ ను అసలు దగ్గరకు కూడా రానీకపోవడం అలాగే హైదరాబాదులో ఉన్న కొన్ని ఆస్తులు వాళ్ళిద్దరు పేరు మీదే రాయాలి అనుకోవడం… ఇంటితో సహా ప్రతి ఒక్కటి మంచు విష్ణు అలాగే లక్ష్మీప్రసన్నలకు మాత్రమే ఇవ్వాలని మోహన్ బాబు నిర్ణయం తీసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది.

దీని వెనక వాస్తవాలు ఎలా ఉన్నా మంచు మనోజ్ చేస్తున్న యుద్ధానికి నిన్నటి వరకు సమాజంలో ఓ సానుభూతి కనబడింది. ఆ తర్వాత మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పడ్డ ఆవేదనను విన్న చాలామంది మోహన్ బాబు పై సానుభూతి చూపించారు. మనోజ్ నిన్ను చాలా బాగా చూసుకున్నా అని… కానీ మనోజ్ మాత్రం తన గుండెలపై తన్నాడని ప్రతి ఇంట్లోనూ ఆస్తులు గొడవలు ఉంటాయని కానీ మీడియా మాత్రం తమ కుటుంబ పరువును బజారుకు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని… మనోజ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తనకు ముగ్గురు పిల్లలు సమానమే అనే విషయాన్ని మోహన్ బాబు ఆ ఆడియో ద్వారా స్పష్టంగా చెప్పారు.

అలాగే మనోజ్ తన భార్య మాట విని తాగుడుకు అలవాటు పడి తన అన్న మంచు విష్ణు… అలాగే తమ కుటుంబానికి సహాయం చేస్తున్న వినయ్ అనే వ్యక్తిని గాయపరచాలని ప్రయత్నం చేశాడని మోహన్ బాబు ఆవేదనగా చెప్పారు. అలాగే మీడియా మంచు మనోజ్ తనను కొట్టినట్టు చిత్రీకరిస్తుందని కానీ తన బిడ్డ తనను ఎక్కడా కొట్టలేదని, కేవలం ఘర్షణ మాత్రమే పడ్డామని, ఘర్షణ పడటానికి కొట్టుకోవడానికి చాలా తేడా ఉంది అంటూ మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియో విన్న తర్వాత చాలామంది మోహన్ బాబు తప్పేం లేదు కేవలం మంచి మనోజ్ మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ వయసులో మోహన్ బాబును మనోజ్ ఇబ్బంది పెడుతున్నాడు అనే ఆవేదన కూడా కొంతమంది వ్యక్తం చేశారు.

అయితే అనూహ్యంగా రాత్రి తన ఇంటి వద్దకు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు మైకు తీసుకుని దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు ఆయన పై వచ్చిన సానుభూతి ఆయన దాడి చేస్తున్న విధానం చూసి చాలామంది నివ్వెర పోయారు. 78 ఏళ్ల వయసులో పిల్లల మధ్య ఆస్తులు గొడవలు ఉంటే ఒక పెద్ద మనిషిగా ఎన్నో ఏళ్ల సినిమా అనుభవం ఉన్న వ్యక్తిగా సమాజాన్ని చూసిన వ్యక్తిగా ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇలా బజారుకి వచ్చి బౌన్సర్లతో అలాగే వ్యక్తిగత సిబ్బందిని అడ్డం పెట్టుకుని మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం చూసి చాలామంది మోహన్ బాబు పై దుమ్మెత్తి పోస్తున్నారు.

78 ఏళ్ల వయసులో ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని మోహన్ బాబు… అసలు ఇన్నాళ్ళు పిల్లలను ఏ విధంగా పెంచాడు అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మోహన్ బాబు ఇలా కంట్రోల్ లేకుండా ఉన్నారు కాబట్టే… వాళ్ళ పిల్లలు కూడా అలా ఆస్తులు కోసం రోడ్లు ఎక్కారని పలువురు మండిపడుతున్నారు. సమాజానికి మంచిదారి చూపించాల్సిన మోహన్ బాబు లాంటి వ్యక్తులు ఈ విధంగా ఆస్తులు కోసం రోడ్లెక్కి ఈ విషయంలో ఏ సంబంధం లేని వ్యక్తులపై దాడులు చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. మోహన్ బాబు దాడి చేసిన సమయంలో ఆయనలో కనపడిన ఆవేశం, ఆయన దాడి చేసిన విధానం చూసి చాలా మంది ఇప్పటికీ షాక్ లోనే ఉన్నారు.

ఆయనను అభిమానించే అభిమానులు కూడా అసలు మనం అభిమానించిన మోహన్ బాబు ఇతనేనా అంటూ షాక్ అవుతున్నారు. మీడియా మైకుల ముందు అలాగే సినిమా కార్యక్రమాల్లో పెద్దమనిషిలా మాట్లాడే వ్యక్తికి ఇది ఏమాత్రం సమంజసం కాదని, కుటుంబ సమస్య రోడ్డు మీదకు రావడానికి మోహన్ బాబు ప్రధాన కారణం అనే విషయం నిన్నటితో స్పష్టంగా అర్థమైంది అంటూ పలువురు తమ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు డబ్బు ఆస్తులు అనేవి మంచు కుటుంబ పరువును రోడ్డు మీదకు లాగాయి. నిన్నటితో మోహన్ బాబు కుటుంబంలో ఒక వర్గానికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయం కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది.