ప్రపంచ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే సారథిగా పగ్గాలు అందుకుని రెండు ప్రపంచకప్ లు అందించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ కూల్ కెప్టెన్సీతో టీమ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేయడంలో ధోనీని మించిన వారు లేరు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో ఆడుతున్న ధోనీ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడు. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న మూవీలో మహి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్…గోట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ధోనీ కూడా కనిపిస్తాడని డైరెక్టర్ వెంకట్ ప్రభు హింట్ ఇచ్చారు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న గోట్ మూవీలో క్రికెట్ టీమ్ తో కొన్ని సీన్స్ ఉన్నాయని వెంకట్ ప్రభు చెప్పారు.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తో కొన్ని సీన్లు ఉన్నాయని, వాటిలో ఎవరు కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ ధోనీ ఎంట్రీపై పరోక్షంగా వెల్లడించారు. అదే జరిగితే ధోనీ తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నట్టే. గతంలో ఏ మూవీలోనూ ధోనీ నటించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు సీఎస్కే టీమ్ కు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ రావడానికి ధోనీనే కారణం. ప్రస్తుతం ఈ క్రేజ్ ను మూవీలో వాడుకునేందుకు వెంకట్ ప్రభు సిద్ధమయ్యారు.