కేవలం రెండు సినిమాల అనుభవమే ఉన్నా.. సినిమా, సినిమాకీ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన నాగీ.. ఆ తర్వాత ‘మహానటి’తో ఇటు తెలుగు, అటు తమిళ ఆడియన్స్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ‘కల్కి’ సినిమాతో వస్తున్నాడు
మహానటి’ సినిమాలో కాస్టింగ్ చూశాం. లీడ్ పెయిర్ గా దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ నటిస్తే.. ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, భానుప్రియ వంటి చాలా పెద్ద తారాగణం ఉంది. ఇప్పుడు ‘కల్కి’ విషయంలోనూ కాస్టింగ్ పరంగా మరింత క్రేజ్ పెంచుతున్నాడు నాగీ.
ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ యాక్టర్స్ ఉన్నారు. అసలు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను ఇలాంటి సినిమాలో నటింపజేయడమే నాగ్ అశ్విన్ మొదటి సక్సెస్. దీపిక పదుకొనె, దిశా పటాని వంటి టాప్ బాలీవుడ్ యాక్టర్స్ హీరోయిన్స్ నటించారు.
ఇంకా.. తెలుగు నుంచి రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఈ మూవీలో ఉన్నారు. వీరితో పాటు.. వెటరన్ హీరోయిన్ శోభన ఈ సినిమాలో నటించింది. అలాగే.. మరో మలయాళీ యాక్ట్రెస్ అన్నా బెన్ కూడా కీ రోల్ లో కనువిందు చేయబోతుంది. ఇప్పటివరకూ ఎక్కువగా బెంగాలీ సినిమాల్లోనే సందడి చేసిన సస్వత ఛటర్జీ ‘కల్కి’లో కమాండర్ మానస్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ విలక్షణ నటుడు పశుపతి మరో కీలక పాత్రలో నటించాడు.
కల్కి’లో కేమియోస్ కూడా భారీగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రాజమయౌళి, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సినిమాలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. ‘మహానటి’ కీర్తి సురేష్.. ఈ చిత్రంలో బుజ్జి వెహికల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. మొత్తంగా.. కాస్టింగ్ పరంగానూ ‘కల్కి’ హాట్ టాపిక్ గా మారింది.