జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్నాళ్ళుగా ఎన్నో ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేయడం, దానికి తారక్ నుంచి సమాధానం ఉండకపోవడం, ఇక తెలుగుదేశం పార్టీతో దూరం పెంచుకోవడం జరుగుతూ వస్తున్నాయి. చివరికి తన సోదరి 2018 ఎన్నికల్లో పోటీ చేసినా ఎన్టీఆర్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరిన్ని ఏపీ అసెంబ్లీలో అవమానించిన సమయంలో ఎన్టీఆర్ స్పందన చాలా మందికి నచ్చలేదు అనే చెప్పాలి.
ఇక తన మిత్రులు కొడాలి నానీ, వల్లభనేని వంశీ మోహన్… చంద్రబాబుపై నందమూరి కుటుంబంపై విమర్శలు చేస్తున్నా స్పందించకపోవడం ఎన్టీఆర్ అభిమానులకు కూడా నచ్చలేదు. ఇక కీలకమైన మొన్నటి ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. దీనిపై టీడీపీ అభిమానుల్లో కాస్త ఆగ్రహం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం మాత్రం జరిగింది. ఎన్టీఆర్… విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు గానూ చంద్రబాబుని కలిసారు.
అలాగే బాలయ్య కుమారుడు సినిమా ఎంట్రీపై కూడా ఎన్టీఆర్ స్పందించారు. అయితే తాజాగా ఎన్టీఆర్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. మొదటి నుంచి తాను నటుడ్ని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 17 ఏళ్ల వయసులో మొదటి సినిమా చేశానన్న ఎన్టీఆర్… అప్పటి నుంచి నా చూపు సినిమాలు, నటనవైపే అని క్లారిటీ ఇచ్చాడు. ఓట్ల సంగతి అలా ఉంచితే.. నా కోసం టికెట్లు కొంటున్నారని… ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
నటుడు కావాలని మంచి నిర్ణయం తీసుకున్నా… నటుడిగా సంతోషంగా ఉన్నా అని ఎన్టీఆర్ స్పష్టం చేసాడు. దీనితో ఎన్టీఆర్ ఇక రాజకీయాల్లోకి రావడం కల్లె అంటున్నారు ఫ్యాన్స్ కూడా. రాజకీయాలపై అతనికి ఏ మాత్రం ఆసక్తి లేదనే విషయం ఈ వ్యాఖ్యలతో స్పష్టత వచ్చింది అంటున్నారు. ఇదిలా ఉంచితే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దేవర ముందు నెగటివ్ టాక్ తో ఇబ్బంది పడినా తర్వాత మౌత్ పబ్లిసిటీ సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా భారీ వసూళ్ళ దిశగా వెళ్తోంది.