ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత రతన్ టాటా మరణం నుంచి ఇంకా దేశ ప్రజలు బయటకు రాలేదు. సేవా కార్యక్రమాలతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మానవతా మూర్తి తిరిగిరాని లోకాలు వెళ్తే ప్రతీ ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యుడు తమను వదిలి వెళ్ళినట్టుగా బాధపడటం గమనార్హం. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు మరణించారు గాని… రతన్ టాటా స్థాయిలో ఎవరి మరణం పట్ల ప్రజల నుంచి ఈ స్థాయిలో స్పందన రాలేదు అనే మాట వాస్తవం. వ్యాపారం కంటే కూడా సేవా కార్యక్రమాలతోనే రతన్ టాటా ప్రజలకు చేరువయ్యారు.
అయితే ఆయన సినిమాల్లో కూడా పెట్టుబడి పెట్టారనే విషయం చాలా మందికి తెలియదు. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టి ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలి అని ఆయన భావించి ఆ రంగంలో మాత్రం విఫలం కావడం గమనార్హం. మొదలుపెట్టిన ప్రతీ వ్యాపారంలో సక్సెస్ అయినా… సినిమా రంగంలో మాత్రం రతన్ టాటా ఫెయిల్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ లు… అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలలో నటించిన ఒకే ఒక్క చిత్రానికి సహ-నిర్మాతగా వ్యవహరించారు రతన్ టాటా.
విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను… రతన్ టాటా టాటా, BSS బ్యానర్‌పై జతిన్ కుమార్‌తో కలిసి నిర్మించారు. 2004లో విడుదలైన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఏట్‌బార్ అనే సినిమాను నిర్మించారు. రియా మల్హోత్రా (బిపాసా బసు)ని, ఆమె ప్రియుడు ఆర్యన్ త్రివేది (జాన్ అబ్రహం) నుండి రక్షించాలనుకునే డా. రణ్‌వీర్ మల్హోత్రా (అమితాబ్ బచ్చన్)పై జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 1996 అమెరికన్ ఫిల్మ్ ఫియర్ ప్రేరణతో వచ్చిన ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్ లు నటించారు.
సుప్రియా పిల్‌గావ్‌కర్, టామ్ ఆల్టర్, అలీ అస్గర్, పృథ్వీ జుట్షి, శృతి ఉల్ఫత్ సహా పలువురు సహాయక పాత్రల్లో నటించారు. అయితే సినిమా జనాల్లోకి అంత బాగా వెళ్ళలేదు. 9 కోట్లతో తీసిన ఈ సినిమా కనీసం ఖర్చుని కూడా రాబట్టడంలో ఫెయిల్ అయింది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం రూ.4.25 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా… మొత్తం రూ.7.96 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఇక రతన్ టాటా సినిమాల్లో పెట్టుబడి పెట్టలేదు. ఈ సినిమా గురించి కూడా ఆయన ఎక్కడా మాట్లాడలేదు.