Pan India Movies: సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేయడం సులభమే. కానీ, అందుకు తగ్గ థియేటర్స్ దొరకడం కష్టం. అందులోనూ పండగ సీజన్‌లో రిలీజ్ అంటే థియేటర్స్ దొరకడం ఇబ్బందే. ఎందుకంటే ప్రతి భాషలో క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయి. దసరాకు వస్తున్న పాన్ ఇండియా మూవీస్ కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటోంది. దసరా రిలీజెస్‌లో జోరంతా పాన్ ఇండియా మూవీస్‌దే. కన్నడ నుంచి శివరాజ్‌కుమార్ ‘ఘోస్ట్’ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది.
అయితే.. తెలుగులో భగవంత్ కేసరి.. లియో.. టైగర్ నాగేశ్వరరావు థియేటర్స్ అన్నింటినీ కబ్జా చేయడంతో.. ఘోస్ట్‌కు తెలుగులో థియేటర్స్ దొరకలేదు. దీంతో.. 19న రావాల్సిన ఘోస్ట్ తెలుగులో 25న విడుదలవుతోంది. జైలర్‌లోని గెస్ట్ అపీరియన్స్ శివరాజ్‌కుమార్‌కు తెలుగు, తమిళంలో క్రేజ్ తీసుకొచ్చింది. హీరోగా నటిస్తున్న ఘోస్ట్‌తో క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటే.. థియేటర్స్ దొరకని పరిస్థితి. దీంతో సినిమాను వారం ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కన్నడలో ఘోస్ట్ క్రేజీ మూవీగా రిలీజ్ కావడంతో.. లియోకు కన్నడలో థియేటర్స్ తక్కువే దొరుకుతున్నాయట. హిందీలో ప్రమోషన్ లేకుండానే రిలీజ్ అవుతోంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు వున్న క్రేజ్ లియోకు తెలుగులో భారీ బిజినెస్ తీసుకొచ్చింది. దీంతో లియో తమిళంతోపాటు తెలుగు, మలయాళంనే నమ్ముకుంటోంది. దసరా బరిలో దిగుతున్న ‘భగవంత్ కేసరి’ తెలుగులోనే రిలీజ్ అవుతుంటే.. ‘టైగర్ నాగేశ్వరరావు మాత్రం పాన్ ఇండియాగా వస్తోంది.
హిందీలో టైగర్ ష్రాఫ్ ‘గణపత్’కు మరీ ఎక్కువ థియేటర్స్ అవసరం లేకపోవడంతో.. టైగర్ నాగేశ్వరరావుకు మంచి థియేటర్సే దక్కాయి. అయితే.. ఘోస్ట్.. లియో దెబ్బకు కన్నడ, తమిళంలో కావాల్సినన్ని థియేటర్స్ దొరకలేదట. తెలుగు, తమిళంలో మార్కెట్ పెంచుకోవాలనుకున్న టైగర్ ష్రాఫ్ కల తీరడం లేదు. ఎక్కడికక్కడ పెద్ద సినిమాలు పాతుకుపోవడంతో.. ఈ బాలీవుడ్ కుర్ర హీరోకు తెలుగు, తమిళంలో థియేటర్స్ దొరకడం లేదట. పేరుకు పాన్ ఇండియా మూవీ అన్నట్టు ప్రాంతీయ భాషల్లో గణపథ్ రిలీజ్ అవుతోంది.