PAN INDIA: పాన్ ఇండియా మూవీ అంటే ఓ క్రేజ్ అయిపోయింది. కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపాయని, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు, మ్యాటర్ ఉన్నా లేకున్నా, ఐదు భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా మూవీలనేస్తున్నారు. మొన్న స్కందని ఇలానే ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే, లోకల్‌గానే ఆడలేదు. అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో అటు బోయపాటి, ఇటు రామ్ పరువు పోయింది. సుధీర్ బాబు మూవీలు కూడా అలానే చేయబోతే చేతులుకాలాయి.
సందీప్ కిషన్ లాంటి మీడియం రేంజ్ హీరో కూడా మైఖేల్ అంటూ పాన్ ఇండియా పాట పాడాడు. ఏమైంది..? ఆ సినిమా డిజాస్టర్‌గా మారింది. ఒక్క మూవీతో పాన్ ఇండియా స్టారైపోదామనుకుంటే పర్లేదు. కాని కంటెంట్ ఉండాలి. అందులో క్వాలిటీ ఉండాలి. దీనికి తోడు నార్త్ ఇండియాలో రూ.15 నుంచి రూ.50 కోట్ల వరకు ప్రమోషన్‌కే ఖర్చు పెట్టాలి. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ హిందీ ప్రమోషన్‌కే రూ.18 కోట్లు ఖర్చయ్యాయట. హిందీలో సినిమా రిలీజ్ అంటే, అక్కడి మార్కెట్లో కోట్లు కొల్లగొట్టేయొచ్చనుకుంటారు. కానీ, కనీసం పది పదిహేను రోజులు అక్కడ ఛానెల్లు, మీడియా ఇంటర్వూలు, నార్త్ ఇండియాలోని నాలుగైదు రాష్ట్రాల్లో ఈవెంట్లు ఉండాలి. అందుకే ఛార్టెడ్ ఫ్లైట్‌లో ప్రయాణాలు, స్టార్ హోటళ్లలో బస ఏర్పాట్లు.. ఇవన్నీ కలిసి రూ.15 నుంచి రూ.60 కోట్లు కావాలి. అది కూడా సినిమాను బట్టి ప్రమోషన్‌కి ఖర్చు అవుతోంది. ఏదో ఐదు భాషల్లో సినిమా రిలీజ్ అయితే, సినిమా ఆడినా ఆడకున్నా, అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో డబ్బొస్తుంది.
సినిమా ఆడితే పెద్ద మార్కెట్ అయిన హిందీ నుంచి కూడా కోట్లు కొల్లకొట్టేయొచ్చు. ఈ ఆశతోనే కార్తికేయ 2 లాంటి లక్కీ సినిమాలను చూసి మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ ఆశపడుతున్నారు. నిర్మాతలు మాత్రం బొక్కబోర్లా పడుతున్నారు. ఇంత ఖర్చు చేస్తే పాన్ ఇండియా ఫ్లాప్ మూవీస్‌కి శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా రాక సీన్ రివర్స్ అవుతోంది. అందుకే పెద్ద హీరోలకు తప్ప మీడియం రేంజ్ హీరోలకి పాన్ ఇండియా ఫార్ములా తలకు మించిన భారమే అనుకోవాల్సి వస్తోంది.