Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు సినిమాలపై ఫోకస్ చేయబోతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఎక్కువ రోజులు సినిమాలకే కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నవంబర్‌లో కూడా కొన్ని రోజులు సినిమాలకే కేటాయించబోతున్నారు. దీంతో రెండు నెలలకుపైగా వారాహి యాత్ర, రాజకీయాలకు పవన్ బ్రేక్ ప్రకటించబోతున్నారు.
పవన్ కళ్యాణ్ చేపట్టిన మూడు విడతల వారాహి యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోదావారి జిల్లాలు, విశాఖలో వారాహి యాత్ర విజయవంతమైంది. రాజకీయంగా పవన్, జనసేన ఇమేజ్ పెరిగేందుకు దోహదపడింది. స్థానిక సమస్యలపై పవన్ స్పందించిన తీరుకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇదే కోవలో వరుసగా వారాహి యాత్ర చేపడుతారని అంతా భావించారు. కానీ, పవన్ మాత్రం అనూహ్యంగా వారాహి యాత్రకు బ్రేక్ ఇవ్వాలని డిసైడయ్యారు. కొద్ది రోజులు సినిమాలకు టైం కేటాయించబోతున్నారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయేమోనని కూడా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వైఎస్ జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన ఎన్నికలకు ఆరు నెలలకుపైగా సమయం ఉన్నందువల్ల రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చినా సమస్య లేదని పవన్ భావించారు. దీంతో వారాహి యాత్రకు బ్రేక్ పడింది. మరోవైపు పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూవీలు పవన్ చేస్తున్నారు. వీటి చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇది సాధ్యం కాలేదు. అందుకే పవన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. వారి కోసం పవన్ సినిమాలకు టైం కేటాయించబోతున్నారు.
సెప్టెంబర్‌లో కొద్ది రోజులు ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత ఓజీకి డేట్స్ కేటాయించారు. వీటిలో ఓజీ షెడ్యూల్ విదేశాల్లో జరగొచ్చు. ఆ తర్వాత అక్టోబర్‌లో కూడా ఈ రెండు చిత్రాలకు డేట్స్ ఇచ్చారు. కుదిరితే నవంబర్‌లో కూడా కొద్ది రోజులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ లోపు సినిమాల్ని వీలైనంత వరకు పూర్తి చేయాల్సిందిగా దర్శక, నిర్మాతలకు పవన్ సూచించారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తీసుకురావాలనేది యూనిట్ ప్లాన్. అది కుదరకపోతే.. ఎన్నికల్లోపు ఒక్క సినిమానైనా రిలీజ్ చేయాలనేది పవన్ ఆలోచన. ఇది కచ్చితంగా జనసేనకు ఉపయోగపడుతుంది. అందుకే సినిమాలకు వరుసగా డేట్లు కేటాయించారు. నవంబర్ తర్వాత ఎక్కువగా పాలిటిక్స్‌పై పవన్ దృష్టి పెడతారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే వేసవిలో ఎన్నికలు జరుగుతాయి. ఆలోపు జనసేన సిద్ధం కావాల్సి ఉంది. దీనికి అనుగుణంగా ప్రణాళికతో పవన్ ముందుకెళ్తున్నారు. అయితే, ఏపీలో రాజకీయ పరిస్థితులనుబట్టి పవన్ ప్లానింగ్స్ మారినా ఆశ్చర్యంలేదు.