Pawan kalyan: పూనమ్‌కౌర్, పవన్ కల్యాణ్ మధ్య ఏముందోనన్న సోది గురించి మనకు అనవసరం. ఛాన్స్ దొరికినప్పుడల్లా పవన్‌కు చురకలంటించే ఈ నటి.. తాజాగా పవర్‌స్టార్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోస్టర్‌పై చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత అభిమానులకు ఎక్కడో కాలేలా చేశాయి. అయితే ఆమె రియాక్షన్‌లో ఏమైనా లాజిక్ ఉందా?
పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావం నాడు మాట్లాడిన ఫస్ట్ స్పీచ్ గుర్తింది కదా! అది విన్న చాలా మందికి పూనకాలు వచ్చేశాయి. భగత్‌సింగ్‌ను గుర్తుచేసుకుంటూ పవన్ మాట్లాడిన తీరు అందరిని కట్టిపడేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కాషాయ పార్టీతో కలిసి అడుగులేస్తున్నాడు. కాషాయంతో పసుపుని కూడా మిక్స్ చేసి రీమిక్స్ ఓట్లు తెచ్చుకుని జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలనుకుంటున్నాడు. సరే అదంతా రాజకీయం..! ఇప్పుడు భగత్ సింగ్ గురించే చర్చ. పవర్ స్టార్ కొత్త సినిమా ఉస్తాద్.. పోస్టర్‌లో భగత్ సింగ్ పేరును పవన్ పాదాల కింద ఉంచడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు నటి పూనమ్ కౌర్. ఇది అహంకారమా? అజ్ఞానమా? అంటూ ప్రశ్నించారు. ఇది పవన్ కల్యాణ్ అభిమానులకు కోపాన్ని తెప్పించింది. ఇంకా చేసేదేముంది.. సోషల్‌మీడియాలో ఆమెపై తిట్ల వర్షం.. కొంతమంది బూతుల వరద ఏరులై పారించారు..! అయితే నిజానికి పూనమ్ కౌర్ మాటల్లో లాజిక్ ఉందా? పోస్టర్‌లో భగత్ సింగ్‌కు నిజంగా అవమానం జరిగిందా?
భగత్‌సింగ్‌ను ఎప్పుడో అవమానించేశారు
కొంతమంది అతిగాళ్లు ఉంటారు. పవన్ కల్యాణ్‌ని భగత్‌సింగ్‌తో పోల్చుతుంటారు. మరికొంత మంది క్యూబా విప్లవయోధుడు చే గువేరాతో పవన్‌ని కంపేర్ చేస్తుంటారు. వాళ్లతో పోల్చి చూడటానికి పవన్ ఊడ పొడిచిందేంటో అలా పోల్చే వాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. భక్తి భావానికి అడ్డూ అదుపు ఉండదన్న చేదు నిజాన్ని అంగీకరించి ముందుకుపోదాం! ఇదంతా అభిమానులు చేసే అతిగాని.. పవన్ ఏనాడూ కూడా తనను తాను ఎక్కువగా భావించుకోలేదు. అయితే ఆయన వేసిన రాజకీయ అడుగులు మాత్రం భగత్‌సింగ్‌కు అవమానకరమే! అది ఎందుకో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉండాలి.
భగత్‌సింగ్ స్వతంత్ర సమరయోధుడే కాదు.. అంతకుమించి
మనలో చాలా మందికి భగత్‌సింగ్ స్వతంత్రం కోసం ప్రాణాలు ఆర్పించిన ఓ యోధుడుగానే తెలుసు. కానీ అతని ఐడియాలజీ గురించి పెద్దగా చర్చించుకోరు ప్రజలు. బ్రిటీషర్లు జైల్లో పెడితే మన నాయకులు ఆటోబయోగ్రఫీలు రాసుకునే కాలమది. కానీ భగత్ సింగ్ వేరు.. అతను ప్రజల్లో నింపాలనుకున్న స్ఫూర్తి వేరు. అతను దేశాన్ని ఊహించుకున్న తీరు వేరు. మరికొన్ని రోజుల్లో తాను చనిపోతానని అతడికి తెలుసు. ఏదో ఒక రోజు దేశాన్ని బ్రిటీషర్లు వీడతారనీ తెలుసు. అందుకే జైల్లో ఉండగానే తన కలానికి పదును పెట్టాడు భగత్‌సింగ్. సమాజంలో తిష్టవేసిన మూడనమ్మకాలు, వివక్షపై యుద్ధం ప్రకటించాడు. ‘why i am an atheist’ అంటూ భగత్‌సింగ్ రాసిన పుస్తకం ఓ సంచలనం. తానేందుకు నాస్తికుడిగా మారానో.. దేవుడు లేడని ఎందుకు చెబుతున్నానో అంటూ ఆయన వివరించిన తీరు అద్భుతం. ఇక అదే భగత్‌సింగ్ నింపిన స్ఫూర్తితో పార్టీ పెట్టానంటూ జనసేన స్థాపించిన పవన్‌కల్యాణ్ ఎప్పుడూ కూడా ఆయన అడుగుజాడాల్లో నడించింది లేదు. అలాంటిది పోస్టర్ గురించి పూనమ్ కౌర్ కొత్తగా ఫీల్ అవ్వడం దేనికి?
అభిమానులకే అర్థంకాదు
భగత్‌సింగ్, చే గువేరా అంటూ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాన్ తొలి స్పీచ్‌లోనే నరేంద్ర మోదీకి మద్దతు కూడా ప్రకటించారు. పదేళ్లు(2004-2014) కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని.. మోదీలో మాత్రం మంచి నాయకుడు కనపిస్తున్నాడంటూ చంద్రబాబు, బీజేపీ తరఫున ప్రచారం చేశాడు. 2014 ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. 2017వరకు టీడీపీ, బీజేపీతోనే కలిసి ఉన్న వవన్‌కల్యాణ్.. ఆ తర్వాత స్పేషల్ స్టేటస్ విషయంలో ఈ రెండు పార్టీలు చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ లెఫ్ట్ పార్టీలతో జత కట్టాడు. పనిలో పనిగా బీఎస్పీ లీడర్ మాయావతి పీఎం కావాలంటూ బడుగు వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పవన్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.
ఒక్కటంటే ఒక్క సీటే రావడంతో.. ఆ తర్వాత పవన్ తీసుకున్ననిర్ణయాలు ఆయనలో భగత్‌సింగ్‌ని చూసుకున్న వాళ్లకి కరెంట్ షాక్ తగిలేలా చేశాయి. బీజేపీతో కలిసి ఆయన నడవాలని నిర్ణయించుకోవడం.. వామపక్ష భావజలం కలిగిన పవన్ అభిమానులకు మింగుడు పడలేదు. ఒకసారి ‘రైట్’ అని.. మరోసారి ‘లెఫ్ట్’ అని.. ఇంకోసారి మళ్లీ ‘రైట్’ అంటూ పవన్ పదేపదే స్టాండ్స్ మార్చారు. భగత్‌సింగ్ స్ఫూర్తి అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు ‘సంఘ్’ భజన చేస్తున్నారు. కులాలు, మతాలు లేని రాజకీయాలు చేస్తామంటూ డప్పు కొట్టుకున్న పవన్.. ఇప్పుడు చేస్తున్నదేంటీ? మతాల మధ్య గొడవలు పెట్టే అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఎప్పుడో భగత్‌సింగ్ ఆశయాలను కాషాయ మంటల్లో కలిపేసింది నిజమే కదా? మరీ ఇప్పుడు కొత్తగా పోస్టర్లలో అవమానించడమేంటి..? ఇదేం లాజిక్ పూనమ్ కౌర్..?