BRO Teaser: ఇది అట్టాంటిట్టాంటి టీజర్ కాదు బ్రో.. దుమ్ము లేవాల్సిందే !

టీజర్ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి ముందే.. వింటేజ్ పవన్ కల్యాణ్ కనిపించాడు భయ్యా..! లుంగీ లుక్‌.. ఆ స్మైల్‌.. పాత పవన్‌కల్యాణ్‌ను పరిచయం చేశాడు. టీజర్ చూస్తే మెదిలే ప్రశ్న ఒక్కటే.. పవర్‌స్టార్ మాస్‌ అప్పీల్‌కు బాక్సాఫీస్‌ పరిస్థితి ఏంటా అని !

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 07:32 PM IST

BRO Teaser: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో మూవీ టీజర్ వచ్చేసింది. టీజర్ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి ముందే.. వింటేజ్ పవన్ కల్యాణ్ కనిపించాడు భయ్యా..! లుంగీ లుక్‌.. ఆ స్మైల్‌.. పాత పవన్‌కల్యాణ్‌ను పరిచయం చేశాడు. టీజర్ చూస్తే మెదిలే ప్రశ్న ఒక్కటే.. పవర్‌స్టార్ మాస్‌ అప్పీల్‌కు బాక్సాఫీస్‌ పరిస్థితి ఏంటా అని ! టీజర్ గురించి మూడు రోజుల కిందే అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అప్పుడు మొదలైన ఫ్యాన్స్ సందడి.. టీజర్‌తో పీక్స్‌కు చేరింది.

ఏంటీ.. చీకటిగా ఉంది.. పవర్ లేదా అని సాయిధరమ్ తేజ్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. పవర్ లేదా అన్నప్పుడు పెద్ద మెరుపు.. ఆ మెరుపు మధ్యలోంచి పవన్ ఎంట్రీ.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు అంటే అనుమానం కాదు. చీకట్లని చీల్చినట్లు పవన్ ఎంట్రీ అదుర్స్ అనిపిస్తుంది. ఇక టీజర్ మొత్తం తేజ్‌, పవన్ మధ్యే ఉంటుంది. దేవుడి పాత్రలో నటిస్తున్న పవన్.. మోడ్రన్‌ లుక్స్‌లో అదరగొట్టాడు. కాలం.. మీ గడియారానికి అందని ఇంద్రజాలం అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అదుర్స్ అనిపించింది. ఇక విడుదల చేసింది నిమిషంన్నర టీజర్ అయినా.. తేజ్‌తో కలిసి పవన్ చేసిన అల్లరి అదుర్స్ అనిపించింది. థమన్‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కేక పుట్టింది. కొన్ని షాట్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పిచ్చాయ్.

కెమెరామెన్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇక పవన్ పాత సినిమాలు గుర్తు చేసేలా.. కొన్ని సినిమాల రిఫరెన్స్‌లు చేయించడం ఆకట్టుకుంది. అప్పుడు తమ్ముడులో లుంగీ సీన్.. ఇప్పుడు బ్రోలో లుంగీ సీన్ అంటూ.. కంపారిజన్ మొదలైంది. ఇక టీజర్‌ చివరలో సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా అంటూ పవన్ చెప్పిన డైలాగ్‌.. గిలిగింతలు పెట్టించడం ఖాయం. ఓవరాల్‌గా టీజర్‌లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి అనిపించింది. గోపాల గోపాల సినిమా తర్వాత బ్రో మూవీలోనూ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు పవన్‌.

ఒకరకంగా ఇందులో గెస్ట్ రోల్‌. ఏమైనా.. టీజర్ అమాంతం అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్‌ దగ్గర మరింత రచ్చ ఖాయం అనిపిస్తోంది. ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ డైలాగులు అందించాడు. వినోదయ సీతమ్ మూవీకి ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగినట్లు భారీగానే మార్పులు చేసినట్లు టీజర్‌లో కనిపించింది.