Pawan Kalyan: తమిళ సినీ పరిశ్రమపై బ్రో మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమ నుంచి నటుడు నాజర్ స్పందించారు. తమిళ పరిశ్రమకు సంబంధించి ఫెఫ్సీ (ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. తమిళ సినీ పరిశ్రమలో తమిళ నటులకే అవకాశాలు ఇవ్వాలి. షూటింగులు తమిళనాడులోనే జరపాలి.
కచ్చితంగా అవసరమైతే తప్ప.. తమిళ సినిమా షూటింగులు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చేయడానికి వీల్లేదు. నిర్దిష్ట కాలానుగుణంగా షూటింగ్ జరగకపోయినా, బడ్జెట్ పెరిగిపోయినా నిర్మాతలు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. ఇలాంటి కొన్ని రూల్స్‌ను ఫెఫ్సీ రూపొందించింది. ఈ విషయాన్ని తమిళ దర్శక, నిర్మాత ఆర్కే సెల్వమణి స్పష్టం చేశారు. దీనిపై ఇతర పరిశ్రమల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై బ్రో మూవీ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. “తమిళ చిత్ర పరిశ్రమలో తమిళులకే అవకాశాలు అంటే పరిశ్రమ ఎదగదు. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోందంటే అన్ని భాషల వాళ్లను తీసుకోవడం వల్లే. బ్రో మూవీకి కేరళ నుంచి వచ్చిన సుజీత్ వాసుదేవన్ (కెమెరామెన్), నార్త్ నుంచి వచ్చిన నటి ఊర్వశి రౌతేలా, విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన స్టైలిస్ట్ నీతా లుల్లాను మేం తీసుకుంటాం.
అన్ని భాషలు, అన్ని కలయికలు ఉంటే సినిమా అవుతుంది తప్ప.. కేవలం మన భాష వాళ్ళు మాత్రమే ఉండాలని అంటే కుంచించుకుపోతాం. తమిళ పరిశ్రమ కూడా ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమాలు తీయాలి. తమిళ సినిమాల్లో తమిళులే ఉండాలనే భావనలోంచి బయటకు రావాలి. తమిళ సినిమాలో రోజా, జెంటిల్‌మెన్ వంటి గొప్ప సినిమాలు తీసిన నిర్మాత ఏఎం రత్నం తెలుగువారు. ఒకవేళ తమిళ ఇండస్ట్రీలో సినీక కార్మికులకు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి. వాళ్ళకు ఉపాధి దొరకాలి. సమస్య పరిష్కారం కోసం మరో మార్గం ఆలోచించాలి” అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తమిళేతరులకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమ పెద్దలు స్పందిస్తున్నారు.
నటుడు నాజర్ ఈ అంశంపై బదులిచ్చారు. పవన్ చెప్పినట్లుగా ఇతరులకు అవకాశాలు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని తమిళ సినిమా తీసుకోలేదన్నారు. ఈ రోజుల్లో అది సాధ్యం కాదని, అందరు నటులు అన్ని పరిశ్రమల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఫెఫ్సీ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తమిళులకు అవకాశాలు ఇవ్వాలని ఫెఫ్సీ సూచించిందే కానీ, ఇతరులకు అవకాశాలు అడ్డుకోవద్దని కాదని, అలా జరిగితే ఆ నిర్ణయాన్ని అందరికంటే ముందుగా తానే అడ్డుకుంటానని చెప్పారు. అయితే, ఈ విషయంలో ఫెఫ్సీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై స్పష్టత వస్తుంది.