BIG BOSS CASE : బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు ఇకపై ర్యాలీలు నిషేధించే ఛాన్స్ !

రియాలిటీ షో బిగ్ బాస్ 7 ఫైనల్స్ రోజున జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసంపై పోలీసులు కార్యక్రమ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు.  హింసాత్మక ఘటనలకు షోని నిర్వహిస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియాని కూడా బాధ్యులను చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 41ఏ  CRPC కింద ఈ నోటీసులు ఇష్యూ చేశారు. ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. 

  • Written By:
  • Updated On - December 26, 2023 / 01:41 PM IST

బిగ్ బాస్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ (Big boss 7 winner Pallavi prasanth)  ప్రకటించిన తర్వాత… అన్నపూర్ణ స్టుడియో దగ్గర జరిగిన అల్లర్లపై పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ కేసులో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఈ అల్లర్లకు బాధ్యులుగా బిగ్ బాస్ ఆర్గనైజర్లకు కూడా జూబ్లీహిల్స్ పోలీసులు నోటిసులు ఇచ్చారు.  అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిసి కూడా ముందస్తు రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు.  అభిమానులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ? బిగ్ బాస్ నిర్వహణకు సంబంధించి సెన్సార్ బోర్డు అనుమతులు ఉన్నాయా… లాంటి ప్రశ్నలతో నోటీసులు ఇచ్చిన పోలీసులు వాటికి వివరణ కోరారు.  బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియా వీటికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది.

బిగ్ బాస్ కి సంబంధించి గతం నుంచి అనేక వివాదాలు నడుస్తున్నాయి.  కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఈ షో ఉందని కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు.  సీపీఐ నారాయణ అయితే .. బిగ్ బాస్ షోని నిషేధించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.  మొన్నటి అల్లర్ల కేసులో … నటుడు, షో హోస్ట్ నాగార్జున (Big boss hoist Nagarjuna) మీద కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి దాకా బిగ్ బాస్ 7 సీజన్లు జరిగాయి. కానీ ఎప్పుడూ లేనివిధంగా కంటెస్టెంట్ అభిమానుల మధ్య గొడవలు జరగడం, ఆర్టీసీ బస్సులు, పోలీసుల వెహికిల్స్ విధ్వంసం జరిగాయి.  దాంతో ఇకపై కంటెస్టెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు తీయకుండా  చూడాలని బిగ్ బాస్ నిర్వహణ సంస్థ నిర్ణయించింది.  రాబోయే షోస్ లో…. కంటెస్టెంట్స్ తో ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవాలని భావిస్తోంది.  కంటెస్టెంట్ గా ఎంపికైన వారు గానీ.. విన్నర్లు, రన్నర్లు, ఫైనలిస్టులు ఇలా ఎవరూ కూడా  అన్నపూర్ణ స్టుడియో దగ్గర ర్యాలీలు తీయరాదు.  షో పూర్తికాగానే నేరుగా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోవాలి.  అభిమానులను కలవాలి అనుకుంటే…. డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళాలి తప్ప… హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించకూడదంటూ నిబంధనలు తీసుకొస్తున్నారు బిగ్ బాస్ ఆర్గనైజర్స్.  ఈ అల్లర్లపై ఆర్టీసీ డ్రైవర్, జూబ్లీహిల్స్ SI రాకేష్, గీతూ రాయల్ ఫిర్యాదులు ఇచ్చారు. మొత్తం మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు.  ఆ రోజు అల్లర్లకు పాల్పడిన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తున్నారు పోలీసులు.  మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.