The Kerala Story: సినిమాలు, రాజకీయాలు.. ఒకదానితో ఒకటి విడదీయలేని ప్యాకేజీ వంటివి. సినిమా తారలు రాజకీయాల్లోకి వస్తారు.. రాజకీయాల మీద సినిమాలొస్తాయి.. సినిమాల్ని రాజకీయానికి వాడుకుంటారు. ఇప్పుడు ది కేరళ స్టోరీ విషయంలో అదే జరుగుతోంది. ఈ చిత్రాన్ని పార్టీలు పూర్తిగా తమ రాజకీయానికి వాడుకుంటున్నాయి. సినిమా ఒక్కటే.. కానీ, దీనిపై పార్టీల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అవి కూడా తమ రాజకీయ ఉద్దేశాల ప్రకారమే సినిమా విషయంలో నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు సినిమాను నిషేధిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు సినిమాకు పన్ను రాయితీలు కల్పిస్తున్నాయి. ఎందుకింత వ్యత్యాసం? ఇదే అసలుసిసలు సినిమా రాజకీయం.
ది కేరళ స్టోరీ.. దేశాన్ని కుదిపేస్తున్న వివాదాస్పద చిత్రం. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమాగా అనిపిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగానే చిత్రం రూపొందించినట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. అయితే, ఇందులో అన్నీ అబద్ధాలే చూపించారని, వక్రీకరణలతో సినిమా తీశారని కొన్ని రాజకీయ పక్షాలు, ఒక వర్గం ప్రేక్షకులు అంటున్నారు. వాళ్లు ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ సినిమా తీశారని చెబుతోంది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం సినిమాను ప్రోత్సహిస్తున్నాయి. సినిమా చూడాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతున్నాయి. సినిమాకు పన్ను రాయితీలు కల్పిస్తున్నాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధిస్తుంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలు సినిమాకు పన్ను రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఒక సినిమా విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇంత భిన్నంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. వివాదాలు నడిచాయి కానీ.. మరీ ఈ స్థాయిలో రాజకీయం మాత్రం జరగలేదు.
నిషేధం విధించిన రాష్ట్రాలు
ది కేరళ స్టోరీ చిత్రాన్ని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నిషేధించాయి. తమ రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించకుండా నిర్ణయం తీసుకున్నాయి. కేరళ రాష్ట్రం కూడా నిషేధం విధించేందుకు ప్రయత్నించినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఇది సాధ్యం కాలేదు. మరోవైపు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో చిత్రానికి పన్ను రాయితీలు ఇస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దురుద్దేశాలతో నిర్మించిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని తమిళనాడులో నిషేధిస్తున్నట్లు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు తమిళనాడు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ముస్లిం సంఘాలు, ఇతర పార్టీల ఆందోళనల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోనూ పలు చోట్ల చిత్ర ప్రదర్శనను థియేటర్ల యజమానులే స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నారు. అయితే, వాస్తవ సంఘటనలకు అద్దం పడుతూ రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. ఒక వర్గం ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో అందరూ తెలుసుకోవాలని, అందుకే సినిమాకు పన్ను రాయితీ కల్పిస్తున్నామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకే సినిమాపై ఇటు నిషేధం విధించడం.. అటు పన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించడం మన ప్రభుత్వాలకే చెల్లింది.
రాజకీయం కోసమే
ది కేరళ స్టోరీపై నిషేధం విధించినా.. పన్ను రాయితీలు కల్పించినా.. రెండు నిర్ణయాల వెనుక ఉన్నది రాజకీయ మనుగడే. ఇది ఒక వర్గానికి వ్యతిరేకంగా రూపొందిన సినిమా కావడంతో.. ఆ వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ ఈ చిత్రాన్ని సమర్ధిస్తోంది. ఆ వర్గానికి మద్దతుగా నిలిచే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, కమ్యూనిస్టులు ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా భావోద్వేగాల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ఒక పార్టీ భావిస్తోంది. ఈ పార్టీ ఆటలు సాగకుండా చూడాలని మిగతా పక్షాలు అనుకుంటున్నాయి. సినిమా ద్వారా తమకు అనుకూల వర్గాల ఓట్లు కొల్లగొట్టాలన్నది పార్టీల ప్రణాళిక. అందుకే తమ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే, ఇందులో ఏ పార్టీ సినిమాను సినిమాగా చూడటం లేదు. అదే అసలు సమస్య. ఇప్పడు ఈ చిత్రం ఒక వర్గానికి వ్యతిరేకంగా రూపొందింది. దీనికి పన్ను రాయితీలు ఇచ్చారు సరే.. రేపు మరో వర్గానికి వ్యతిరేకంగా సినిమా తీసినా ఇలాగే స్పందిస్తారా? లేదా అప్పుడు వ్యతిరేకిస్తారా? ఏదేమైనా ఈ వివాదం సినిమాకు భారీ కలెక్షన్లు కురిపిస్తోంది.