పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాడు ప్రభాస్. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. అయితే.. బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతునే ఉంది. ఫ్లాప్ టాక్‌తో కూడా వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటున్న హీరోగా దుమ్ముదులిపేస్తున్నాడు. సలార్‌తో 180 కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకున్న ప్రభాస్.. కల్కితో ఫస్ట్ డే 191 కోట్లు రాబాట్టాడు.
దీంతో.. ఇండియన్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 తర్వాత థర్డ్ ప్లేస్‌లో నిలిచింది కల్కి. ఇక ఇప్పుడు రెండు వారాల్లో వెయ్యి కోట్లు రాబట్టి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్కి. తాజాగా 1000 కోట్ల క్లబ్‌లో చేరింది కల్కి. దీంతో.. రెండు వెయ్యి కోట్లు సినిమాలున్న హీరోగా ప్రభాస్ మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. బాహుబలి 2 తర్వాత వెయ్యి కోట్ల సినిమాగా కల్కి నిలిచింది. అయితే.. ప్రభాస్ కంటే ముందే.. రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న రికార్డ్ షారుఖ్ ఖాన్ పేరు మీద ఉంది.
పఠాన్, జవాన్ సినిమాలు ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్లు రాబట్టాయి. కానీ సౌత్ నుంచి రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోగా ప్రభాస్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక.. ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్ తీసుకుంటే.. దంగల్ రెండు వేల కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. 1800 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్ 2, జవాన్, పఠాన్ సినిమాలున్నాయి. ఇప్పుడు కల్కి వెయ్యి కోట్ల జాబితాలో చేరిన ఏడో సినిమాగా నిలిచింది. మరి లాంగ్ రన్‌లో కల్కి ఎంత రాబడుతుందో చూడాలి.