Lucifer 2: ఓ కథను రెండు భాగాలుగా చెప్పడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మొదటి భాగం కథతో ఆసక్తిని రేకెత్తించి, రెండో భాగం కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ విషయంలో సక్సెస్ కొట్టిన మోహన్ లాల్ ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్‌ని స్టార్ట్ చేశారు. అబ్రహాం ఖురేషిగా వచ్చే ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. 2019లో కేరళలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే రూ.200 కోట్ల వసూళ్లని రాబట్టింది. అయితే ఇదే ప్రాజెక్ట్‌ని తెలుగులో గాడ్ ఫాదర్‌గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు చిరంజీవి. ఇక ‘లూసిఫర్’ ఒరిజినల్ వర్షన్‌ని ఓపెన్ ఎండింగ్‌తో ముగించాడు పృథ్వీరాజ్. దీంతో ఈ ప్రాజెక్ట్‌కి సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఈగర్‌గా వైయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా లూసిఫర్ సీక్వెల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు మోహన్ లాల్. షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్‌కి లూసిఫర్2:ఎంపురాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగంలో నటించిన మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు. మొదటి పార్ట్‌ను మలయాళంలో మాత్రమే రిలీజ్ చేసిన పృధ్వీరాజ్ సీక్వెల్ పార్ట్‌ని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నాడు.
లూసిఫర్ సినిమాలో మోహన్‌లాల్ స్టీఫెన్ గట్టుపల్లి అనే ఓ రాజకీయ నాయకుడిగా కనిపించాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషిగా అతడు ఉన్నట్లు క్లైమాక్స్‌లో చూపించారు. సెకండ్ పార్ట్‌లో ఒక సాధారణ వ్యక్తి అయిన స్టీఫెన్.. అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు..? అతడు చేసిన పనులు ఏంటి..? ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు..? అనే విషయాలను చూపించబోతున్నారు. ప్రజెంట్ సెట్స్‌పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్‌తో 200 కోట్లు వసూలు చేసిన మోహన్ లాల్ సీక్వెల్‌తో ఎలాంటి వండర్స్ సృష్టిస్తాడో చూడాలి.