Chandrababu Naidu: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు పీటీ వారెంట్ జారీ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. దీని ప్రకారం ఈ నెల 16, సోమవారం రోజు కోర్టులో వ్యక్తిగతంగా హాజరుపర్చాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యక్షంగా చంద్రబాబును హాజరుపర్చాలని ఏసీబీ జడ్జి ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
చంద్రబాబుకు ఈ నెల 19 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే చంద్రబాబు జైలులో ఉన్నందున ఆయనకు పీటీ వారెంట్ జారీ చేయాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా అనుమతించింది. అయితే, క్వాష్ పిటిషన్ విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే దానికి అనుగుణంగా జోక్యం చేసుకోవచ్చని కూడా చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది. కాగా, క్వాష్ పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తాని ఏసీబీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. సీఐడీ తరఫున సీనియర్ లాయర్ వివేకానంద వాదించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. మరోవైపు చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్ జారీ చేస్తుంది. అంటే ఒక కేసులో అప్పటికే అరెస్టై, జైలులో ఉన్న ఖైదీని, మరో కేసు విచారణ కోసం ఆ జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేందుకు కోర్టు ఇచ్చే అనుమతే పీటీ వారెంట్. పోలీసులు, దర్యాప్తు సంస్థలు అడిగితే.. దీనిపై విచారణ జరిపి కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది.