దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఇండియన్ సినిమా షేక్ అవుతోంది. ఒక్కో సినిమాకు గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ… సినిమా సినిమాకు రేంజ్ పెంచేస్తూ… బాక్సాఫీస్ పై దారుణమైన యుద్ధం చేస్తూ… ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ కు ఎయిమ్ చేసాడు. మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేసిన జక్కన్న… సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో అనే టెన్షన్స్ మహేష్ ఫ్యాన్స్ లో పీక్స్ లో ఉన్నాయి. రాజమౌళి సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. కథ నుంచి సినిమాలో గ్రాఫిక్స్ వరకు అన్నీ కూడా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు.
విదేశాల్లో సినిమా షూట్ అంటే జనాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ సినిమాను ఆఫ్రికా గడ్డి భూముల్లో జక్కన్న ప్లాన్ చేసాడు. ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో షూట్ చేయడానికి ఇప్పుడు లోకేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసాడు జక్కన్న. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో భయంకరమైన క్రూర మృగాలు ఉండే అంబోసెలి నేషనల్ పార్క్ లో జక్కన్న ఓ ఫోటో రిలీజ్ చేసాడు. ఆ ఫోటోలో వెనుక అడవి జంతువులు కనపడుతున్నాయి. అక్కడ ఉండే జంతువులు తెలిస్తే గుండె ఆగిపోతుంది.
ఆఫ్రికన్ బుష్ ఏనుగు, కేప్ గేదె, ఇంపాలా, సింహం, చిరుత, మచ్చల హైనా, మసాయి జిరాఫీ, గ్రాంట్ జీబ్రా మరియు బ్లూ వైల్డ్ బీస్ట్ లకు ఈ అడవి నిలయంగా ఉంది. అలాంటి అడవిలో ఇప్పుడు మహేష్ తో షూటింగ్ చేయనున్నాడు. ఇక్కడి అడవి జంతువులను చూడటానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు కూడా పీక్స్ లో ఉంటాయి ఈ ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలో జక్కన్న రిస్క్ చేయడం చూస్తుంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉండవచ్చు అంటూ కామెంట్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి ఇప్పుడు.
ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే జక్కన్నపై సెటైర్ లు వేస్తున్నారు. లొకేషన్ కు ఏడాది, నటుల కోసం ఏడాది, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఏడాది, తీయడానికి ఒక రెండేళ్ళు, నీ సినిమాల కోసం ఎదురు చూడటం కంటే కిరణ్ అబ్బవరం సినిమాలకు ఫ్యాన్ అవ్వడం మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు… భారీగా జుట్టు, గడ్డం పెంచుకుని రెడీ అయ్యాడు. రెండు పార్ట్ లుగా సినిమాను చేసే ఛాన్స్ ఉంది. జనవరి 15 తర్వాత సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.