Oscar RRR: ఆస్కార్ వేడుకలో సీటు కోసం రాజమౌళి టీమ్ పడిగాపులు

రాజమౌళి ఒక అంతర్జాతీయ ఏజన్సీ ద్వారా ఆస్కార్ వేడుకకు హాజరుకావడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఆస్కార్ అధికారిక వేదికపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటునాటు డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరగడమే తప్పా ఇప్పటివరకు అధికారికగా అనుమతి రాలేదు.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 06:05 PM IST

ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే అకాడమీ కమిటీ నుంచి మన RRR హీరోలకి ఇంకా అధికారిక ఆహ్వానమే అందలేదా…?
ఇప్పటి వరకు అన్నీ తానై వ్యవహారం నడిపించిన జక్కన్నను…కమిటీ అసలు పట్టించుకోవడం లేదా..?
నాటునాటు పాటకు గాను… చంద్రబోస్ ,కీరవాణి మాత్రమే రెడ్ కార్పెట్ మీదకు వెళితే .. రాజమౌళి అండ్ కో సాధారణ ఆహ్వానితుల్లా జనం లో కూర్చోవాల్సిందేనా..?

ఆస్కార్ నామినేషన్ నాటు నాటు పాటకు మాత్రమే కనుక సినిమా దర్శకుడు ,హీరోలు రాం చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ కార్యక్రమానికి అధికారికంగా హాజరవ్వడం కష్టం. వాళ్లకు అనుమతి ఉండదు. ఒకవేళ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయి ఉంటే బృందం మొత్తం హాజరవ్వొచ్చు. అవార్డ్ నామినేషన్ కేవలం పాటకు మాత్రమే కాబట్టి గేయ రచయిత, సంగీత దర్శకులు, సింగెర్స్ కి మాత్రమే
అధికారిక ఆహ్వానం అందింది.

ఆస్కార్ వేడుక కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కుటుంబాలతో ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. కానీ ఆస్కార్ అధికార వేడుకలో వీళ్లు కూర్చునే అవకాశం లేదు. అయితే రాజమౌళి ఒక అంతర్జాతీయ ఏజన్సీ ద్వారా ఆస్కార్ వేడుకకు హాజరుకావడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఆస్కార్ అధికారిక వేదికపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నాటునాటు డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరగడమే తప్పా ఇప్పటివరకు అధికారికగా అనుమతి రాలేదు. ఆస్కార్ వేదికపై ప్రదర్శనలకు అవకాశం తక్కువ. ఒకవేళ ఆస్కార్ స్టేజ్ పై చెర్రీ, జూనియర్ నాటునాటు డాన్స్ కి అవకాశం లేకపోతే హాలీవుడ్లో ఇతర వేదికల పైన అయినా చేయించాలని రాజమౌళి పట్టుదలగా ఉన్నాడు.

ఆస్కార్ వేదికను పూర్తిగా తన బ్రాండ్ పెంచుకోవడానికి ఉపయోగించాలని దర్శకధీర ఆలోచన. అందుకే ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రచారం కోసం 80 కోట్లు ఖర్చు చేశారని టాక్. అంతర్జాతీయ ఏజెన్సీలు ఇప్పటికి ఇదే పనిపై చాలా ఎక్సర్ సైజ్ చేస్తున్నాయి. ఆస్కార్ వేదికపై కాకపోయినా హాలీవుడ్ లో ఉన్న మరికొన్ని ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్టేజెస్ పైన నాటునాటు పాటకు హీరోలు ఇద్దరు స్టెప్పులు వేస్తారు. ఈలోపు ఆస్కార్ వేడుకకు ఇన్విటేషన్లు సంపాదించే పనిలో పడింది జక్కన్న అండ్ టీం. అంతే కాదు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తే కనుక సన్మానాలకు.. సత్కారాలకు తెలుగు సంఘాలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పనిలో పనిగా NRI కుల సంఘాలు కూడా సిద్ధమౌతున్నాయి.