యూవీ క్రియేషన్స్‌కు చెందిన వెంకట్, రామ్ చరణ్ కలిసి వీ మెగా పిక్చర్స్ అనే కొత్త బ్యానర్ ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో ఫస్ట్ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేశాడు చెర్రీ. వీర్‌సావార్కర్ 140వ జయంతి సందర్భంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించబోతున్నాడు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు రాం వంశీ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వీ మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ ప్రజెంట్ చేస్తున్నాడు. చరిత్ర మర్చిపోయిన ఓ స్వాతంత్య్ర సమరయోధుని కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. 1905లో లండన్‌లో జరిగిన ఈ కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ-2 సినిమాతో నిఖిల్, అనుపమ్ ఖేర్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో మంచి క్రేజ్ వచ్చింది. కార్తీకేయ2 సినిమాలో నిఖిల్ అనుపమ్ ఖేర్ మధ్య ఉండే సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమాలో కూడా వీళ్లిద్దరినీ ప్రధాన పాత్రల్లో పెట్టినట్టు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా పేట్రియాటిక్ కథలు, రెట్రో కథలు బాక్సీఫీస్‌ను కొల్లగొడుతున్నాయి. డైరెక్టర్స్ అంతా అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న ది ఇండియా హౌజ్ కూడా అలాంటి కథే కావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు రామ్ చరణ్ బ్యానర్‌లో వస్తున్న సినిమా కావడం. కశ్మీర్ ఫైల్స్ కార్తికేయ2 లాంటి సినిమాలు అందించినవాళ్ల హ్యాండ్ ఉండటంతో సినిమా మీద ఆటోమేటిక్‌గా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను ఇండియాతో పాటు కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. కొత్త బ్యానర్‌లో వస్తున్న ఫస్ట్ సినిమాతో చెర్రీ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.