Ram Gopal Varma: తన సినిమాలు, స్పీచ్‌లతో అందరినీ షాక్‌కు గురి చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు సెన్సార్ బోర్డ్ రివర్స్ షాకిచ్చింది. ఆయన రీసెంట్‌గా తీసిన వ్యూహం (Vyuham) సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తూ నోటీస్ ఇచ్చింది. దీంతో ఈ నెల 10న రిలీజ్ కావాల్సిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీశారు.
ఈ సినిమాకు సీక్వెల్‌గా శపథం సినిమా కూడా చేస్తున్నట్టు చెప్పారు. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. రెండు సినిమాల రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాను సెన్సార్ కోసం సెన్సార్ బోర్డ్‌కు పంపించారు మేకర్స్. కానీ ఈ సినిమాలో తీసుకున్న కంటెంట్ ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం, చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడంపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగా వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై మేకర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో ఏ సీన్స్ నచ్చలేదో కూడా చెప్పకుండా సినిమాను రివైజింగ్ కమిటీకి ఎలా రిఫర్ చేస్తారంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. సినిమాలో అభ్యంతరాలుంటే ముందు మేకర్స్‌తో చర్చించిన తరువాత రివైజింగ్ కమిటీకి పంపించాలి.. కానీ ఆ ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా రివైజింగ్ కమిటీకి పంపించారంటూ చెప్పారు.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్‌లో బ్రేక్ పడేలా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ తన దృష్టికి వచ్చిందన్నారు రామ్ గోపాల్ వర్మ. కానీ దాని గురించి ఎలాంటి ఆధారాలు లేకపోవడం కారణంగా ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రివైజింగ్ కమిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసిన తరువాత సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామంటూ చెప్పారు.