Ravanasura: రవితేజ రాకరాక ఫామ్‌లోకి వచ్చాడు. వరుస హిట్స్ దక్కాయి అనుకునే లోపే.. రావణాసుర దెబ్బ కొట్టింది. టైటిల్లో నెగిటివ్ యాంగిల్ వున్నట్టే.. సినిమాపై కూడా నెగిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. మాస్‌రాజా చేయాల్సిన మూవీ కాదని.. అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. మాస్‌రాజా అభిమానులకే నచ్చని సినిమాగా నిలిచిపోయింది రావణాసుర.
రావణాసురలో రవితేజను నెగిటివ్ యాంగిల్లో చూపించాలనుకున్నారేగానీ.. ఈ నెగిటివ్ రిజల్ట్‌ను ఊహించలేకపోయాడు దర్శకుడు. అలాగే.. కథ రొటీన్‌గా ఉండకూడదని హీరోకు నెగిటివ్ షేడ్స్ పెట్టాడు. అలాగని అద్భుతమైన కథా అంటే అదీ కాదు. ఇలాంటి స్టోరీ లైన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చింది. ‘వించిదా’ అనే బెంగాలీ సినిమాకు ఫ్రీ రీమేక్‌గా రావణాసురను మసి పూసి మారేడు కాయ చేశాడు. కాపీ కథకు ఉప్పు, కారం చల్లి స్పైసీగా తీర్చిదిద్దామనుకున్నారేగానీ.. ఈ కథ ఎక్స్‌పైర్ అయి చాలాకాలం అయిందని మరిచిపోయారు.
క్లైమాక్స్‌కు అరగంట ముందు వరకు రవితేజకు నెగిటివ్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. హీరో చేసే వరుస హత్యలు చూస్తుంటే… ఫ్లాష్‌బ్యాక్ వుందని.. హీరో మంచివాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ వుందని ఊహించుకుంటే.. అదీ లేదు. తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై డ్రగ్ మాఫియా సినిమాలు ఎన్ని చూడలేదనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే.. సినిమా మొత్తం ఇదే ఫీలింగ్‌లో ఆడియన్స్ ఉండాలి. కానీ, మధ్యమధ్యలో రిలాక్స్ మూడ్‌లోకి ప్రేక్షకుడు వెళ్లిపోతాడు.
సినిమాలో హీరో.. హీరోయిన్ వెంటపడే సాంగ్ ఒకటి కావాలి. వెంకటేశ్ నటించిన పాత సినిమా సూర్య ఐపీఎస్ నుంచి ‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు’ పాటను రీమిక్స్ చేసేశారు. ఒక పనైపోయిందని చేతులు దులుపుకునేలా ఈ రీమిక్స్ వుందే తప్ప.. పాత పాటలోని ప్లేవర్‌ను రీ క్రియేట్ చేయలేకపోయారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన రవితేజ… రావణాసురతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమయ్యాడనే చెప్పాలి. ఈ హీరో నోటి వెంట వచ్చిన మాటలు.. చేతలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేశాయి. డిఫరెంట్‌గా ట్రై చేసి… తనకున్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకున్నాడు రవితేజ. ఈసీనియర్ హీరో వయసు 55 అంటే ధమాకాలో నమ్మడం కష్టమైనా.. రావణాసురలో మాత్రం ఒరిజినల్ ఏజ్ బైటపడిపోయింది. ధమాకా… వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ తర్వాత రావణాసురతో హ్యాట్రిక్ కొడతాడని ఫ్యాన్స్ ఆశపడితే….రావణాసుర నీళ్లు చల్లింది.