RAVITEJA: బాలకృష్ణ, రవితేజ మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఇవాల్టిది కాదు. దీనికి 15 ఏళ్ల చరిత్ర వుంది. ఈ ఇద్దరి సినిమాలు రెండుసార్లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ముచ్చటగా మూడోసారి దసరా రేసులో దిగుతున్నారు. బాలకృష్ణ భగవంత్ కేసరిగా.. మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా.. నువ్వా నేనా అంటూ ఫైటింగ్‌కు దిగుతున్నారు. ప్రతిసారీ గెలుస్తున్న మాస్‌రాజా మరోసారి సత్తా చాటుతాడా.. లేదంటే డోంట్ కేర్ అంటూ బాలయ్యే హిట్ కొడతాడా..? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. రవితేజ, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే.. మాస్‌రాజా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
ఎందుకంటే.. పోటీపడిన ప్రతిసారీ మాస్‌రాజాదే పై చేయి. ఈ రిజల్ట్‌ను తిప్పి కొట్టాలని బాలయ్య ఫ్యాన్స్ కాచుకుని కూర్చున్నారు. ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ 2008లో మొదలైంది. ఆ ఏడాది సంక్రాంతికి జనవరి 11న బాలయ్య ఒక్కమగాడుగా వస్తే.. ఆ మరుసటి రోజునే.. రవితేజ కృష్ణగా వచ్చి బాక్సాఫీస్‌ను దోచేసుకున్నాడు. ఒక్కమగాడు అభిమానులనే నిరాశపరచగా.. కృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంది. 2009లో బాలకృష్ణ మిత్రుడుతో… రవితేజ కిక్‌తో వారం గ్యాప్‌లో వచ్చారు. కిక్ బాక్సాఫీస్‌కు కిక్ ఎక్కిస్తే.. మిత్రుడు కనిపించలేదు. 2011 సంక్రాంతి బాలయ్య వర్సెస్ రవితేజగా మారింది. బాలకృష్ణ పరమవీరచక్రగా వస్తే.. రవితేజ మిరపకాయ్‌తో వచ్చాడు. మిరపకాయ్ ఘాటుకు పరమ వీరచక్ర తట్టుకోలేకపోయాడు. బాలకృష్ణ, రవితేజ మధ్య ఫైటింగ్ మరోసారి తప్పలేదు. చాలాసార్లు సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న బాలయ్య.. మాస్‌రాజాతో ఫైటింగ్ వచ్చేసరికి రెండుసార్లు చేతులెత్తేశాడు.
అయితే ఈసారి వేదిక దసరా అయింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి అక్టోబర్ 19న.. రవితేజ చేసిన స్టూవర్ట్‌పురం దొంగ బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు 20న రిలీజ్ అవుతూ దసరాను హీట్ ఎక్కించాయి. భగవంత్ కేసరితోపాటు.. 19నే విజయ్ లియో రిలీజ్ అవుతున్నా.. ఈ ఇద్దరి మధ్య పోటీని లైట్‌గా తీసుకుంటున్నారు. అయితే.. దసరా ఫైట్ అంతా బాలయ్య వర్సెస్ మాస్ మహారాజాగా మారిపోయింది. బాలయ్యతో ఫైట్‌లో ఇంతకాలం రవితేజదే పైచేయిగా నిలిచింది. ఈసారి కూడా రవితేజ ఇదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేసి దసరా మొనగాడు అనిపించుకుంటాడా? లేదంటే.. ఈ సెంటిమెంట్‌కు బాలయ్య బ్రేకులేస్తాడో చూడాలి మరి.