ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె ఏది మాట్లాడినా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఆమె నుంచి వస్తున్న కొన్ని పోస్ట్ లు ఆసక్తిగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పవన్ పై పలు సందర్భాల్లో ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఇటీవల ఆమె పవన్ కళ్యాణ్ ను కలిస్సే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న ఆమె… పవన్ కళ్యాణ్ ను కలిసి తన ఆలోచన చెప్పనున్నారని పవన్ కళ్యాణ్ సహకారం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. తెలంగాణాలో మంత్రి కొండా సురేఖను కూడా రేణు దేశాయ్ కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే అనే సాంగ్‌ను తన ఫొటోకు యాడ్ చేసి షేర్ చేసారు రేణు దేశాయ్.
ఆ పోస్ట్ లో ఆమె ఆసక్తికర విషయాలు రాసుకొచ్చారు. చాలామంది దృష్టిలో నేను ఒక సింగిల్ పేరెంట్‌ను మాత్రమే కాదు విడాకులు తీసుకున్న పెద్దగా నవ్వే స్త్రీని మాత్రమే అని రాసిన ఆమె… పురుషుల ప్రపంచంలో నా నిబంధనలపై జీవిస్తున్నానని తెలిపారు. ఎవరు గట్టిగా మాట్లాడుతారో వారే ధృఢంగా ఉంటారు అని అనుకుంటున్నాను అని రేణు అభిప్రాయపడ్డారు. మగవాడి ఆసరా లేకుండా తన పిల్లలను పరిపూర్ణంగా పెంచే తల్లిని… ఒక మహిళ తన సొంతంగా వ్యాపారాన్ని నడుపుతుందో ఆమె మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలదు అని నా అభిప్రాయం అని ఆమె పోస్ట్ చేశారు.
సమాజం అసమంజసమైన పితృస్వామ్య డిమాండ్లకు అనుగుణంగా ఇష్టపడని స్త్రీని అని తెలిపారు. నన్ను అనుసరించే యువతులందరికీ స్వతంత్ర ఆలోచనా విధానం ఉంటే ఫర్వాలేదు అని చెప్పాలనుకుంటున్నానన్న ఆమె… మీరు ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉండటం మంచిది అని సూచించారు. మీ గుర్తింపు కేవలం ఒకరి కుమార్తెగా లేదా భార్యగా కాదు అని స్పష్టం చేసారు. మీకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉంది కాబట్టి గుర్తింపు తెచ్చుకోవాలి అని పిలుపునిచ్చారు. స్త్రీవాదం అంటే మనం సంప్రదాయ విలువలను అగౌరవపరచడం కాదన్నారు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాల తరబడి సాగుతున్న అన్యాయాన్ని నిలదీయడం అని పిలుపునిచ్చారు. మీ సామర్థ్యాన్ని నమ్మడం ప్రారంభించండి అని కోరారు. మీకూడా ఒక జీవితం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ రేణు పిలుపునిచ్చారు.