ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్‌కే చాలా మంది ఓట్ చేసినట్టు పలు సంస్థలు ఇప్పటికే ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి. సాధారణంగా ఆస్కార్ ఓటింగ్ సరళిని గమనిస్తూనే ఈ ప్రిడిక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దీంతో వీటిని కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. దానికి తోడు ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా నాటు నాటుక పాటే వస్తోంది. ఈ పాటకు స్టెప్పులేయని సెలబ్రెటీలు లేరు. అంతర్జాతీయంగా ఇంత క్రేజ్ సంపాదించినా.. మన దేశంలో మాత్రం ఈ ప్రమోషన్స్‌కు ఇంత ఖర్చు అవసరమా అంటూ విమర్శలు వస్తున్నాయి.
కానీ ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్’ జాబితాలో మన నాటు నాటుకే జై కొడుతున్నారు. ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్” వంటి మీడియా హౌస్‌ల సర్వేలో “నాటు నాటు…” పాటకే అగ్రతాంబూలం లభించింది. కాబట్టి, ఆస్కార్ అవార్డు ఈ పాటకే దక్కుతుందని అత్యధికులు భావిస్తున్నారు. అలాగే మన దేశం నుండి ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కూడా మంచి పొజిషన్స్‌లో ఉన్నట్టు ప్రిడిక్షన్స్ జాబితాలు చెప్తున్నాయి.. ఏది ఏమైనా ఓ తెలుగు సినిమా నుండి ‘ఒరిజినల్ సాంగ్’కు తొలిసారి నామినేషన్ దక్కించుకున్న ‘నాటు నాటు…’ పాటలో ఫోక్ రిథమ్, పీరియడ్ నేచర్, డాన్స్ వంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకున్నారని, అందువల్ల తప్పకుండా ఈ పాటకే ఆస్కార్ అవార్డు దక్కుతుందని అమెరికాలోని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. సో… సోమవారం ఉదయం ఐదు గంటలకు ఇండియన్ మూవీ లవర్స్ టీవీలకు అతుక్కు పోవలసిందే!