కొన్ని రోజుల నుంచి నేచర్ మధ్య దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది సాయి పల్లవి. సాయి పల్లవి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది అని అంతా అనుకున్నారు.. కానీ తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లింది. తన యాత్ర గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 60 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు ఆయాసపడుతూ కొండ ఎక్కుతుంటే.. ఇంత దూరంలో దేవుడు ఎందుకు ఉన్నాడు అనిపించిందట సాయి పల్లవికి. కానీ దర్శనం చేసుకుని వస్తున్న భక్తులు చేసే శివనామస్మరణ ఆయాసపడుతున్న భక్తుల్లో ఉత్తేజాన్ని నింపిందట. ఆ దృశ్యాన్ని చూసిన తరువాత ఎంతో స్పూర్తిని పొందిందట. ఒకరికి తోడు ఒకరు అన్నట్టు శివభక్తులు పరస్పరం శివనామస్మరణ చేస్తూ కొండ ఎత్తుకున్న తీరు ఆమెకు ఎంతో నచ్చిందట.
అలసట వచ్చిన ప్రతీసారి శివనామస్మరణ చేస్తూ భక్తులు శక్తి తెచ్చుకుంటున్నారట. ఇవన్నీ చూసిన సాయి పల్లవి ఆ అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది అంటూ రాసుకొచ్చింది. యాత్రలో ఒకరికి ఒకరు ఎలా తోడు ఉన్నారో.. జీవితంలో కూడా ఒక మనిషికి ఇంకో మనిషి ఖచ్చితంగా తోడు అవసరమని పోస్ట్ చేసింది సాయి పల్లవి. యాత్రకు వెళ్లిన భక్తులను అక్కడి ఆర్మీ, సీఆర్‌పీఎస్ సిబ్బంది కాపాడుతున్న తీరు కూడా తనకు చాలా నచ్చిందని చెప్పింది. అమర్‌నాథ్ యాత్ర తన ఆత్మవిశ్వాసానికి, శరీర దృఢత్వానికి పరీక్ష పెట్టిందంటూ చెప్పిందని, అమర్‌నాథ్ యాత్రలాగే జీవిత యాత్రలో కూడా ప్రతీ మనిషికి ఒక తోడు అవసరమని తాను తెలుసుకున్నానంటూ ఫ్యాన్స్‌తో పంచుకుంది సాయిపల్లవి.