SALAAR: సలార్, గుంటూరు కారం సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ సమస్యలు..

ప్రభాస్, మహేశ్ బాబు లాంటి బడా స్టార్ల సినిమాలొస్తున్నాయంటే గద్దలా వాలిపోయి ఏరియా రైట్స్ కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడతారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కారణం, మహేశ్, ప్రభాస్ క్రేజ్ తగ్గడమో.. లేదంటే మార్కెట్‌లో మైలేజ్ లేకపోవడమో కాదు.

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 05:04 PM IST

SALAAR: సలార్ మూవీ ఎప్పుడొస్తుందా అని డిసెంబర్ 22 కోసం ఫ్యాన్స్ వేయిట్ చేస్తుంటే, నిర్మాతలు మాత్రం సినిమాను అమ్మలేక తలలు పట్టుకుంటున్నారు. సరే ప్రభాస్‌కి అంత సీన్ లేదా అంటే.. పాన్ ఇండియా రెబల్ స్టార్ తను. అలాంటి ప్రభాస్ మూవీ వస్తోందంటే సెన్సేషన్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ క్రేజ్ తనది. అయినా సలార్ ప్రి రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌కి కష్టాలు తప్పట్లేదు. సినిమా వస్తోందంటే, మరీ ముఖ్యంగా ప్రభాస్, మహేశ్ బాబు లాంటి బడా స్టార్ల సినిమాలొస్తున్నాయంటే గద్దలా వాలిపోయి ఏరియా రైట్స్ కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడతారు.

కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కారణం, మహేశ్, ప్రభాస్ క్రేజ్ తగ్గడమో.. లేదంటే మార్కెట్‌లో మైలేజ్ లేకపోవడమో కాదు. భోళాశంకర్, బ్రో ఈ రెండు మెగా డిజాస్టర్లు. ఖుషీ, స్కంద ఈ రెండు పాన్ ఇండియా డిజాస్టర్లు. వీటికే డబ్బులుపెట్టిన డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరిస్థితొచ్చింది. సరే ఏదో థియేటర్స్ ఓనర్స్‌కు సినిమాలు అమ్మి నిర్మాతల్లానే సేఫ్ జోన్‌లోఉన్నారా అంటే.. ఆ నాలుగు సినిమాలను 60 శాతం తామే థియేటర్స్‌ని రెంట్‌కి తీసుకుని రిలీజ్ చేశారట. అంతే ఉన్నది పాయే, దాచుకుందీ పాయే. ఆ ప్లాప్ మూవీలే కాదు గతంలో డిజాస్టరైన లైగర్, ఆచార్య వల్ల వచ్చిన నష్టాలే ఇప్పటి వరకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లని కోలుకోలేనియ్యలేదు. తాజాగా భోళాశంకర్, బ్రో, ఖుషీ, స్కంద ప్లాపులతో డిస్ట్రిబ్యూటర్ల దగ్గర డబ్బులు నిల్. దీంతో సలార్, గుంటూరు కారం రైట్స్ కొందామని పోటీ పడాలన్నా పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియని పరిస్థితి. సరే మీడియం రేంజ్ మూవీలంటే కొనొచ్చేమో.

కానీ, సలార్, గుంటూరు కారం లాంటి మూవీల ఏరియా రైట్స్ అంటే తైలంగాణ రూ.80 కోట్లు, ఆంద్ర రూ.110కోట్లు ధరలు పలుకుతున్నాయి. అంత పెట్టాలంటే ఆ రేంజ్ అప్పు ముట్టాలి కదా. దిల్ రాజు లాంటి వాళ్లే వెనకడుగు వేస్తుంటే, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి చెప్పడానికి ఏం లేదు. త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్‌కి ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఆ రికార్డుని సలార్ బ్రేక్ చేస్తుందా అంటే.. రూ.170 కోట్ల ప్రి రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయటమే గగనమైపోతోంది.