అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది ‘సలార్’తో డైనోసార్ సినిమా ప్రపంచంలోకి దూసుకొచ్చాడు. కలెక్షన్ల సునామీతో ప్రభంజనం క్రియేట్ చేస్తున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా ఎనౌన్స్ చేసిన రోజే సినిమా రిలీజ్ అయిన తర్వాత సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ‘సలార్’ విజయపథంలో దూసుకెళ్తోంది. సినిమా చూసిన వారు రకరకాలుగా చెప్తున్నప్పటికీ తిరుగులేని కలెక్షన్లు సాధిస్తూ సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
ఊహించిన దానికంటే ఎక్కువే వసూళు చేసింది. సలార్ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 120 కోట్ల రూపాయల షేర్.. 160 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా.. 49 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ నెల రోజుల క్రితమే ఓవర్సీస్‌లో మొదలైంది. అయితే రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది కలెక్షన్లు ఊపందుకొన్నాయి.
డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. తొలి రోజే కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో మొదటిరోజు కలెక్షన్లకు 1 మిలియన్ అనేది ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటిది దాన్ని సునాయాసంగా అధిగమించి మొదటిరోజే 3.8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండో రోజు ముగిసే సరికి 4.5 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 170 నుంచి 180 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ ఫిగర్స్‌ను హోంబలే ఫిలింస్ అధినేతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.