Salman Khan: ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందేనా.. సల్మాన్ ఖాన్ ఏం చెబుతున్నాడంటే

ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే అంటున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల ఓటీటీల్లో వస్తున్న కంటెంట్‌పై సల్మాన్ అసహనం వ్యక్తం చేశాడు. సినిమాల్లాగే ఓటీటీలకూ సెన్సార్ బోర్డు ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Written By:
  • Updated On - April 8, 2023 / 01:02 PM IST

Salman Khan: ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాల్సిందే అని ఎప్పటి నుంచో పలువురు సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు చెబుతున్న మాట. దీన్ని వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. అయితే, ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే అంటున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల ఓటీటీల్లో వస్తున్న కంటెంట్‌పై సల్మాన్ అసహనం వ్యక్తం చేశాడు. సినిమాల్లాగే ఓటీటీలకూ సెన్సార్ బోర్డు ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వెంకటేశ్‌, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తర్వాత ఓటీటీలకు సెన్సార్‌ వుండాలన్న వాదన పెరిగింది. 36 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ లేనిది.. వెంకటేశ్‌ డబుల్‌ మీనింగ్స్.. థర్డ్‌ గ్రేడ్‌ రొమాంటిక్‌ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమయ్యాడు. ఇలాంటి వెబ్‌ సిరీస్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో అంటూ.. వెంకీ ఫ్యాన్స్‌ తల దించుకునే పరిస్థితి వచ్చింది. రానానాయుడు చేసిన డ్యామేజ్‌పై సెలబ్రిటీస్‌ ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ అంశంపై సల్మాన్ స్పందిస్తూ.. ”ఓటీటీల్లో బూతు ఎక్కువైందని… సెన్సార్‌ వుండాలని చాలా మంది అంటున్నారు. 15 ఏళ్ల వయసు పిల్లలూ ఓటీటీల్లోని బూతు కంటెంట్ చూసే అవకాశం వుంది. ఒకవేళ మీ పిల్లలే ఇలాంటివి చూస్తే మీరు ఒప్పుకుంటారా?” అని ప్రశ్నించారు.

ఇలాంటి కంటెంట్‌లో నటిస్తున్న వారిని వుద్దేశిస్తూ.. మితిమీరిన రొమాన్స్‌, ఎక్స్‌పోజింగ్‌, ముద్దు సన్నివేశాల్లో నటిస్తే.. ఆ దృశ్యాలను నటుల ఇంట్లో పనిచేసేవాళ్లు కూడా చూస్తారని.. దాని వల్ల వారి భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం వుందన్నారు. హద్దులు దాటాల్సిన అవసరం లేదని.. మనం ఇండియాలో బతుకుతున్నామనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు సల్మాన్‌. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌పై అన్నివైపులా విమర్శలొస్తున్నాయి. ఈ వివాదానికి సినిమావాళ్లు దూరంగా వున్నా… మొదటిసారిగా విజయశాంతి ఘాటుగా స్పందించారు.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా పోస్ట్‌లో తీవ్రంగా తప్పుపట్టారు. అసభ్యకర దృశ్యాలను తొలగించి ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకోవాలన్నారు. అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో త్వరలోనే ఓటీటీలకి కత్తెర తప్పదన్నమాట.