బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వింటే వణికిపోతున్నారు. తాజాగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు వచ్చిన ఓ బెదిరింపు సంచలనం అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను చంపేస్తానని బెదిరించడమే కాకుండా షారుఖ్ నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండి కాల్ వచ్చింది. ఈ మేరకు గురువారం బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
హత్య బెదిరింపుకు సంబంధించి ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. అయితే, ఈ విచారణలో అతను ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. నవంబర్ 2 న తన ఫోన్ పోయిందని దీనిపై తాను ఫిర్యాదు చేశానని, షారుఖ్‌ను బెదిరించేందుకు ఎవరో దుర్వినియోగం చేసినట్టు పోలీసు విచారణలో వెల్లడించాడు. ఇక్కడ మరో విషయం బయటపెట్టాడు ఆ వ్యక్తి. రెండు మతాల మధ్య ఉద్రిక్తలు కలిగించినందుకు గానూ షారుఖ్ ఖాన్ పై తాను బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, దాని కోసం తనను ఇరికించారని ఫైజన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేసాడు.
1994 లో వచ్చిన అంజామ్ చిత్రంలో షారుఖ్ ఖాన్… జింకను చంపినట్లు చూపించారని… దానిని వండి తన టీంని తినమని చెప్పాడని అతను పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు సినిమాలో ఉన్న డైలాగ్ లు వివాదాస్పదం అయ్యాయి. యూట్యూబ్‌లో ఫైజాన్ విడుదల చేసిన ఓ వీడియోలో షారుఖ్ ఖాన్ కు ఉగ్రవాదులతో లింక్ లు ఉన్నాయని ఆరోపించాడు. ఇక తన గురించి పోలీసులు అడిగితే తనను హిందుస్తానీ అని పిలవాలని ఫైజాన్ ఖాన్ చెప్పినట్టు సమాచారం. నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు కాల్ వచ్చింది.
గత ఏడాది అక్టోబర్‌లో షారుఖ్ ఖాన్‌కు ఇదే తరహాలో చంపేస్తామని ఓ బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత అతని భద్రతను Y+ స్థాయికి పెంచారు అధికారులు. ఆరుగురు సిబ్బంది 24 గంటల పాటు షారుఖ్ కు భద్రత కల్పిస్తారు. ఇక షారుఖ్ ఖాన్ కు గన్ లైసెన్స్ ఉంది. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చిన కొద్ది రోజులకే షారుఖ్ కు రావడం వెనుక లారెన్స్ గ్యాంగ్ ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనితో పోలీసులు అలెర్ట్ అయ్యారు. షారుఖ్ కూడా జింకను చంపాడనే కారణంతో లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి.