S.S Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన పేరు వరల్డ్ టాప్ సెలబ్రిటీల లిస్టులో చేరిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులతో గుర్తింపు దక్కించుకున్న రాజమౌళికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. టైమ్స్ సంస్థ ప్రకటించిన ప్రపంచ టాప్-100 ప్రభావశీలుర జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది.
ఈ ఏడాదికిగాను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో రాజమౌళితోపాటు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు కూడా చోటు దక్కింది. ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023’ పేరుతో టైమ్స్ సంస్థ ఒక జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఇద్దరికే చోటు దక్కింది. వీరిలో రాజమౌళికి ఐకానిక్ క్యాటగిరీలో చోటు దక్కగా, షారుఖ్ ఖాన్‌కు పయోనీర్స్ క్యాటగిరీలో చోటు దక్కింది. వీరితోపాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్, హాలీవుడ్ తార ఏంజెలా బాసెట్, న్యాయనిర్ణేత పద్మాలక్ష్మి, ప్రముఖ గాయని బియాన్స్, సిరియాకు చెందిన స్విమ్మర్ సారా మర్దిని, స్టార్ ఐకాన్ బెల్లా హడిడ్ టాప్-100 జాబితాలో నిలిచారు.
టైమ్స్ మ్యాగజైన్‌లో రాజమౌళి గురించి బాలీవుడ్ నటి అలియా భట్ ఒక ప్రొఫైల్ రాయడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. పాన్ వరల్డ్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుందని టాక్.