Game changer : శంకర్ ను ‘గేమ్ ఛేంజర్’ గట్టెక్కిస్తాడా

భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకడు. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ శంకర్ చిత్రంలోనే కనిపిస్తాయి.

భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకడు. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ శంకర్ చిత్రంలోనే కనిపిస్తాయి. అదే సమయంలో కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. 90లలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారాడు శంకర్.

రాజమౌళి వచ్చే వరకూ సిల్వర్ స్క్రీన్ పై భారీతనం అంటే శంకర్ మాత్రమే గుర్తొచ్చేవాడు. ఇక.. పుష్కరకాలంగా శంకర్ కి సరైన విజయాలు దక్కడం లేదు. ఇండియాస్ స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరాన్ గా పిలుచుకునే శంకర్ కి.. ఇప్పుడు మళ్లీ బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది. అగ్ర కథానాయకులకు దీటుగా పారితోషికాన్ని పుచ్చుకునే శంకర్ గత చిత్రాలు ‘ఐ, 2.0’ ఆశించిన విజయాలు సాధించలేదు. రూ.543 కోట్ల బడ్జెట్ తో ఇండియాస్ కాస్ట్లీ మూవీగా వచ్చిన ‘2.0’ తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ‘భారతీయుడు 2’ మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతుంది.

భారతీయుడు సీక్వెల్ ని 2, 3 భాగాలుగా చెప్పాలకనుకోవడం.. ఒకవైపు ‘గేమ్ ఛేంజర్’, మరోవైపు ‘భారతీయుడు 2, 3’ మూవీస్ ను శంకర్ సైమల్టేనియస్ గా పూర్తి చేయాలనుకోవడం వంటి విషయాలు కూడా ‘భారతీయుడు 2’ రిజల్ట్ పై ప్రభావం చూపించాయనే వాదనలు ఊపందుకున్నాయి. శంకర్ తన చిత్రాలకు తానే కథను సమకూర్చుకుంటుంటాడు. గతంలో అయితే.. శంకర్ కథ ఇస్తే.. రైటర్ సుజాత డైలాగ్స్ సమకూర్చేవారు. అలాగే.. శంకర్ సినిమాల్లోని కథ, కథనాల విషయంలో సుజాత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండేది. ఆయన చనిపోయిన తర్వాతే శంకర్ కి ఎక్కువగా ఫ్లాపులు వస్తున్నాయనే విమర్శలూ వినిపిస్తూ ఉంటాయి.

ఏదేమైనా.. ఇప్పుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పైనే శంకర్ ఆశలు ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే.. ఈ సినిమాకి కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్. తమిళంలో విలక్షణమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాడు కార్తీక్ సుబ్బరాజ్. ఆయన రాసిన కథ కావడంతోనే.. ‘గేమ్ ఛేంజర్’ విభిన్నంగా ఉండబోతుందని.. శంకర్ కి కమ్ బ్యాక్ గా నిలుస్తుందనే ప్రచారమూ ఉంది. మొత్తంమీద.. శంకర్ ని ‘గేమ్ ఛేంజర్’ అయినా గట్టెక్కిస్తాడేమో చూడాలి.