ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో టాలీవుడ్ ఓ రేంజ్ కు ఎదిగింది. ప్రాంతాలు, ఎల్లలు దాటి విశ్వవ్యాప్తమైంది. అయితే ఇప్పటికీ ఇక్కడి కొంతమంది నాయకులు మాత్రం ప్రాంతాలవారీగా గిరిగీసుకుని ఉండిపోతున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అవార్డు గ్రహీతలను సన్మానించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా సాగింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ చేసిన కామెంట్స్ ఆంధ్ర, తెలంగాణ మధ్య మరోసారి విభేదాలకు కారణమయ్యేలా ఉన్నాయి.
ఒకప్పుడు తెలంగాణ అంటే సినిమా ఇండస్ట్రీకి చిన్నచూపు ఉండేదన్నారు మంత్రి శ్రీనివాస గౌడ్. నైజాం ఏరియా హక్కులను దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడేవారని, కానీ ఈ ప్రాంతం వారన్నా, ఇక్కడి భాష, యాసన్నా సినిమా వాళ్లకు ఇష్టం ఉండేది కాదన్నారు. అది తమను ఎంతో ఇబ్బందులకు గురి చేసేదన్నారు మంత్రి శ్రీనివాస గౌడ్. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులో మార్పు వచ్చిందన్నారు. అయితే ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న నాటునాటు పాటలో తెలంగాణ పదాలు చూసి సంతోషం కలిగిందన్నారు. పొలంగట్టు, మిరపతొక్కు, పోలేరమ్మ, పోతురాజు.. లాంటి పదాలు తెలంగాణవేనన్నారు. ఆంధ్రాలో కూడా ఇవి ఉండొచ్చన్నారు.
సినిమా ప్రముఖులందరూ హాజరైన ఈ సమావేశంలో శ్రీనివాస గౌడ్ చేసిన కామెంట్స్ తో వాళ్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. రాజమౌళి అయితే ఏకంగా శ్రీనివాస గౌడ్ ను అలా చూస్తూ ఉండిపోయారు. సినిమా పరిశ్రమను కాపాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చే సరికి ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడా లేదు. పైగా తెలంగాణ ప్రాంత టెక్నీషియన్లకు అత్యధిక అవకాశాలు వస్తున్నాయి. ఈ ప్రాంతం నేపథ్యంలో తీసిని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో శ్రీనివాస గౌడ్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.