ఎవరెన్ని చెప్పినా ఓటీటీ దెబ్బకు ఇప్పుడు సినిమా నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు సినిమాను వందల రోజులు ఆడించే పరిస్థితి నుంచి ఇప్పుడు రెండు వారాలు సినిమా థియేటర్ లో వచ్చి… మౌత్ టాక్ బాగుంటే చాలు… మంచి లాభాలు వచ్చేస్తున్నాయి. తర్వాత సంగతి దేవుడెరుగు అనుకుంటూ సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. ఓటీటీలకు జనం అలవాటు పడిపోయారు. ఇక థియేటర్ కి జనం రాకపోతే ఓటీటీకి అమ్ముకోవడమే దిక్కు. వాళ్ళు అడిగినప్పుడు మనం అమ్మకపోతే… వచ్చేది కూడా రాదు… ఇలా నిర్మాతలు డిమాండ్ చేసే పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది.
అయితే ఓటీటీ విషయంలో బాలీవుడ్ కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది. వాళ్లకు సినిమా లాభాల విషయంలో భయం తక్కువ. మనాళ్ళ పరిస్థితి కాస్త వేరుగా ఉంటుంది. అందుకే బాలీవుడ్ ఒక రూల్ తీసుకొచ్చింది. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలనే రూల్ పెట్టారు. లేకపోతే థియేటర్లు ఇవ్వం అంటూ రూల్ తెచ్చారు. ఇప్పుడు ఆ రూల్ మన తెలుగులో కూడా రావాలంటున్నారు నిర్మాత బన్నీ వాసు. ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… విలేఖరి ప్రశ్నకు కాస్త ఘాటుగా సమాధానం చెప్పారు. “మీరు ఇంట్లో కూర్చుంటే నాలుగు వారాలకే సినిమాను ఓటీటీ ద్వారాప్రసారం చేస్తాం’ అని దిల్‌రాజు అన్నారు కదా… మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటీ అని అడిగారు.
దీనిపై స్పందించిన బన్నీ వాసు… ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా చిత్ర పరిశ్రమలో యూనిటీ లేకపోతే ఏమీ చేయలేం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఛాంబర్, ఇంకెవరైనా రూల్స్ పెడితే, ఇది సక్సెస్ అయ్యేది కాదు అన్నారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్లు ఇవ్వమని బాలీవుడ్ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఇక్కడా కూడా అమలు చేస్తేనే దారిలోకి వస్తారు అంటూ ఆయన కామెంట్ చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి.