Sarala Kumari: సిక్కిం వరదల్లో తెలుగు నటి గల్లంతు.. ఆచూకీ కనుక్కోవాలంటూ కూతురు అభ్యర్థన..

సిక్కిం విహారయాత్రకు వెళ్లిన అలనాటి తెలుగు యాక్టర్‌ సరళకుమారి ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఆమెను కనిపిట్టాలంటూ అమెరికాలో ఉంటున్న సరళ కూతురు నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

  • Written By:
  • Updated On - October 7, 2023 / 05:14 PM IST

Sarala Kumari: ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టి కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో అనేక మంది ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్నారు. సిక్కిం విహారయాత్రకు వెళ్లిన అలనాటి తెలుగు యాక్టర్‌ సరళకుమారి ఈ వరదల్లో గల్లంతయ్యారు. ఆమెను కనిపిట్టాలంటూ అమెరికాలో ఉంటున్న సరళ కూతురు నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

దాన వీర శూరకర్ణ, సంఘర్షణ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న సరళ కుమారి.. అక్టోబరు 2న మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న ఆమె కూతురుకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో సరళ, ఆమె స్నేహితులు ఉన్నట్టు సరళ కూతురు చెప్తున్నారు. రీసెంట్‌గా వరదలు వచ్చిన తరువాత సరళ ఫోన్‌ కలవడంలేదని ఆమె కూతురు చెప్తున్నారు. తల్లి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అక్టోబరు 3న చివరిసారిగా తాను సరళతో మాట్లాడినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత సరళ నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

సిక్కింలో వచ్చిన వార్తల గురించి న్యూస్‌ ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఆర్మీ హాట్‌లైన్‌ నంబర్లకు ప్రయత్నించినా అవి పనిచేయడం లేదన్నారు. ఎలాగైనా తన తల్లిని కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు సిబ్బంది గాలింపు చేపడుతున్నారు.